కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్ర రెడ్డి లకు సీఎం చంద్రబాబు నాయుడు కొండవా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపైకి కోట్ల, కేఈ కుటుంబసభ్యులు వచ్చారు. ఈ రోజు కర్నూల్ జిల్లా కోడుమూరు సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు రైతులకు ఎంతో మేలు చేశారని, రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహత్తర కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు.

అలాగే కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ రావాలని కోట్ల కోరారు. కర్నూలు జిల్లాలో సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. బీజేపీతో కలసి పనిచేస్తున్న వైసీపీకి ప్రజలందరూ బుద్దిచెప్పాలన్న కోట్ల.. రైతుల కష్టాలు తీర్చే టీడీపీకి అందరు ఓట్ వేయాలని పిలుపునిచ్చారు.