మన దేశంలో ఆలయాలకు ఎంతో గణ చరిత్ర ఉంది… చాల ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినట్లు పురాణాలు, ఇతిహాసాలు మనకు తెలియచేయడమే కాకుండా ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా నిరూపిస్తునే ఉన్నారు. మన సనాతన ధర్మంలో భగవంతునిపై ఉన్న నమ్మకంతో అపారమైన భక్తి భావం కలిగి ఉండటం వలన రాజుల చేతగాని, భక్తుల చేతగాని అప్పట్లో నిర్మించబడిన ఆలయాలు ఇప్పటికి విశిష్ట ఆదరణ పొందుతున్నాయి.

ఇక పురాతన ఆలయాలనైతే మరింత జాగ్రత్తగా చూసుకుంటు, ఏదైనా యిబ్బందులు ఎదురైతే మెరుగు దిద్దుతూ మన గత చరిత్రను గర్వంగా పదిల పరుచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. కొన్ని ఆలయాలైతే స్వయంగా దేవతలే కట్టినట్లు కొన్ని పురాణాలు మనకు తెలియచేస్తున్నాయి. స్వయంగా దేవతలే దిగివచ్చి కట్టారని అంటుంటారు.. అలాంటి ఆలయాలను కూడా చూస్తూనే ఉంటారు. అలాంటి ఆలయాలలో నిజంగా ఎన్నో అద్భుతాలు ఉంటాయి… వాటిని చూస్తే నిజంగా దేవతలే కట్టారు కాబోలు అని నమ్మి తీరాల్సిందే.

కాని ఇప్పుడు మీరు వినబోయే ఆలయం కట్టింది దెయ్యాలట. నిజమే ఆ ఊరి ప్రజల నమ్మకంతో పాటు… వారు చెబుతున్న దాని ప్రకారం ఆ ఊరిలో 600 ఏళ్ళ క్రితం దెయ్యాలు శివుని ఆలయం నిర్మించాయని ఆ ఊరి ప్రజల ప్రగాఢ నమ్మకం.

అసలు దెయ్యాలు కట్టిన గుడి ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబలాపురం… దేవనహళ్లి అనే రెండు నగరాల మధ్యలో ఉంది బొమ్మవరే అనే గ్రామం, ఈ గ్రామంలో సుందరేశ్వర శివాలయం అని ఒకటి ఉంది.

ఈ ఆలయాన్ని కొన్ని సంవత్సరాల ముందు దెయ్యాలు నిర్మించాయట. బొమ్మవరే గ్రామస్థులు చెబుతున్న కథనం ప్రకారం ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ ఊరిలో దెయ్యాల బాధ ఎక్కువగా ఉండేదట. ఇలా దెయ్యాల బాధ తట్టుకోలేక ఆ ఊరిలో బుచ్చయ్య అనే వ్యక్తి మంత్ర విద్యలు నేర్చుకుని మంత్రగాడయ్యాడు. బుచ్చయ్య మంత్రాలు నేర్చుకొని మంత్రగాడైనా అతను పరమశివుని భక్తుడట.

శివుని మీద ఉన్న అపారమైన భక్తి వైభవంతో ఒక గుడి కట్టదలచి ఆ ఊరి వారి అండతో ఎంతో శ్రమించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం జరగడం ఇష్టం లేని దెయ్యాలు రాత్రికి రాత్రి ఆ గుడి మొత్తం ధ్వంసం చేశాయట. దానితో బుచ్చయ్య పట్టలేని కోపంతో కొన్ని రోజుల పాటు తీవ్రంగా కఠోరంగా శ్రమించి ఆ దెయ్యాలు అన్నింటిని తన మంత్ర శక్తితో బంధించివేశాడట.

ఆ దెయ్యాలు తమను వదలమని బుచ్చయ్యను వేడుకోగా అతను రెండు షరతుల మీద దెయ్యాలను వదులుతానని చెప్పాడట. ఇక ఆ రెండు షరతులు ఏమిటంటే మీరు ధ్వంసం చేసిన ఆలయాన్ని ఒక్క రాత్రిలో నిర్మించాలని, ఇక ఆ రెండవ షరతుగా ఈ గ్రామం దరిదాపులలో మీరు ఎక్కడ కనపడకూడదని ఎవరని హింసించకూడదని చెప్పడంతో, షరతులకు ఒప్పుకున్న దెయ్యాలు ఒక్క రాత్రిలో గుడిని నిర్మించాయట. అందుకు ఆధారంగా గుడిపై ఉన్న బొమ్మలను చూపిస్తున్నారు.

ఇక ప్రతి ఆలయంపై దేవుళ్ళ బొమ్మలు, అందమైన శిల్పాల బొమ్మలు ఉంటాయి. కానీ ఆ ఆలయంపై మాత్రం దెయ్యాల బొమ్మలు ఉంటాయి. కారణం ఆ గుడిని దెయ్యాలు కట్టడంతో ఇలా దెయ్యాలు తమ బొమ్మలను గుడిపై చెక్కాయని చెబుతున్నారు. ఇక అప్పట్లో దెయ్యాలు గుడి కట్టాయని చెబుతున్నా ఆ గుడిలో మాత్రం విగ్రహ ప్రతిష్ట జరగలేదట. దాదాపుగా 50 ఏళ్ళ క్రితం నీళ్ల కోసం బావి తొవ్వుతుంటే అందులో 8 అడుగుల శివ లింగం కనపడినట్లు చెబుతున్నారు. ఇక ఆ లింగాన్ని ఎత్తుకొచ్చి దెయ్యాలు కట్టిన గుడిలో ప్రతిష్టించారు.

శివుడు భూతనాధుడు కావడంతో ఈ దెయ్యాలు కట్టిన ఆలయంలోనే శివ లింగాన్ని ప్రతిష్ఠిస్తే అంత మంచి జరుగుతుందని గ్రామస్థులు ఒక నిర్ణయానికి వచ్చారట. అందుకే ఆ గుడిలోనే శివ లింగాన్ని ప్రతిష్టించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేసారు. 8 అడుగుల ఎతైన శివలింగం కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ లేదని, ఈ దేవాలయానికి ఉన్న చరిత్ర, ఈ గుడిలో ఉన్న ఎతైన శివలింగంతో తమ గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని… ఇక ఇక్కడ శివ లింగాన్ని దర్శించుకోవడం వలన ఆ పరమేశ్వరుని కృప కలుగుతుందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

నిజంగా ఆ గుడిని దెయ్యాలు కట్టాయో లేదో తెలియదుగాని ఆ గ్రామా ప్రజలతో పాటు, ఆ చుట్టూ పక్కల ప్రజలు కూడా దెయ్యాలే ఈ గుడిని కట్టాయని నమ్మడంతో చాల మంది ఈ గుడిని దర్శించుకోవడానికి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.