ఒకే గదిలో అవివాహిత జంట ఉండడంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోయంబత్తూరులో ఓ ప్రవేటు లాడ్జికి ఇటీవల అధికారులు సీలు వేశారు. ఓ గదిలో పెళ్లికాని జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయన్న కారణంతో పోలీసులు ఆ లాడ్జికి సీలు వేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ లాడ్జి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది. వీరు దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తి ఎమ్ ఎస్ రమేష్ సమక్షంలో విచారణకు వచ్చింది.

ఇక న్యాయమూర్తి ఈ విషయంపై మాట్లాడుతూ.. పెళ్లికాని స్త్రీపురుషులు ఒకే గదిలో ఉండడం తప్పు అనే చట్టం ఎక్కడా లేదని అది ఎలా తప్పు అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘లివింగ్ టూ గెదర్’ విధానంలో సహజీవనాన్ని ఎలా నేరంగా పరిగణించలేమో.. అలాగే లాడ్జిలో ఒకే గదిలో పెళ్లికాని జంట ఉండడాన్ని నేరంగా చూడలేమని ఆయన స్వష్టం చేశారు.

అలాగే మరో గదిలో మద్యం సీసాలు కలిగి ఉండడం ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తుందని.. చెప్పలేమని అన్నారు. తమిళనాడు మద్యపాన చట్టం ప్రకారం ఒక వ్యక్తి స్వదేశంలో తయారైన విదేశీ మద్యం 1 లీటరు, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్ల వైన్ కలిగి ఉండడానికి అనుమతి ఇచ్చిందన్నారు. అందువల్ల ఆ లాడ్జి మూసివేయడం తగదని.. వెంటనే ఆ లాడ్జి సీలు తొలగించాలని న్యాయమూర్తి కోయంబత్తూర్ కలెక్టర్ ను ఆదేశించారు.