ఈరోజు నుంచి ఏపీలో మద్యం షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు కిలోమీటర్ల దూరం నిలబడి మద్యం బాటిల్ దక్కించుకోవడానికి వారు పడిన తపన చూస్తే ఎవరైనా నోరెళ్ళ బెట్టకుండా ఉండలేరు. అంతలా రోడ్ల మీదకు వచ్చి మద్యం కోసం వారి పడిన పాట్లు… పోలీసులతో గిల్లి కజ్జాలు… సామజిక దూరం పాటించాలన్న జ్ఞానం లేకుండా వ్యవహరించడం చూస్తుంటే ఏపీలో అసలు లాక్ డౌన్ అమలులో ఉందా అనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుంచి తెరుచుకున్న మద్యం షాపులలో మద్యం బాటిల్ ధరను అమాంతం 25 శాతం ఏపీ సర్కార్ పెంచేసి పేద వాడి నడ్డివిరిచేసిందని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. కానీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం మరోవిధంగా మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే సీఎం జగన్ మద్యం ధరలను పెంచారని, వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేస్తున్నారు. మద్యం ధరలు పెంచితే పేదవాళ్ళు మద్యానికి దూరమవుతారని ఇలా తనకు నచ్చిన రీతిలో సీఎం మెచ్చుకునేలా తన ప్రసంగాన్ని ఎప్పటిలా దంచికొట్టారు.

అసలు ఈరోజు రాష్ట్రంలో మద్యం షాపుల ముందు ఉన్న పరిస్థితులు చూస్తుంటే అసలు ఎమ్మెల్యే రోజా సోయాలోనే ఉండి మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. ఆమె మాట్లాడుతున్న మాటలకు బయట జరుగుతున్న పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా? మద్యం ధరలు పెంచితే పేద వాడు మద్యానికి దూరమవుతాడని రోజా చెప్పినట్లు జరగాలంటే ఈరోజు మద్యం షాపుల ముందు ఒక్కరు కూడా కనపడకూడదు. దాదాపుగా ప్రతి మద్యం బాటిల్ మీద 25 శాతం పెంచడమంటే మాములు విషయం కాదు. ఎంత పెంచినా మందు బాబులు మద్యం కొనడానికి ముందుకు వచ్చారంటే ఇక్కడ పెంచిన రేట్ల గురించి ఆలోచించే పరిస్థితులలో ఎవరు లేరు.

నిజంగా వైసీపీ సర్కార్ కు పేద వాడిని మద్యం నుంచి దూరం చేయాలనుకుంటే ఈరోజు హడావిడిగా మద్యం రేట్లు పెంచి షాపులు ఓపెన్ చేసి ఖజానా నింపుకోవాలని ఆత్రుత పడేది కాదు. ఈరోజు ఏ పట్టణంలో, ఏ గ్రామంలో చూసినా మద్యం కోసం కిలోమీటర్ల దూరం నిలబడింది పేద వాడు..కార్మికులు, కూలీలు… ఈరోజు ప్రతి మీడియాలో వచ్చిన వీడియోలను గమనిస్తే తెలుస్తుంది.

నిజంగా మద్యపాన నిషేధం అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తే గత 45 రోజులుగా మద్యం దొరకక అలవాటు పడిన మందు బాబులను అలాగే కొనసాగింప చేస్తూ మద్యపాన నిషేధం ఇప్పుడే అమలు చేసి చూపిస్తే సీఎం జగన్ ఇచ్చిన మాట ముందే నిలబెట్టుకున్నాడని చెప్పుకునేవారు కదా? అలా కాకుండా ఖజానా నింపుకోవడానికి వేరే దారిలేక మద్యం రేట్లు పెంచి ఇప్పుడు పేదలను మద్యానికి దూరం చేయాలని అనుకోవడంతోనే మద్యం రేట్లు పెంచుతున్నట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఇంకా మభ్య పెట్టాలని చూడటం హాస్యాస్పదం.

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది

ఈరోజు ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ సర్కార్ మేల్కొనక తప్పదు

ఈరోజు నుండి మొదలైన ఆన్లైన్ ఆర్డర్స్..!