రోజు చీప్ మందు తాగే వాడికి పార్టీ రోజైనా కొంచెం కాస్ట్లీ మందు తాగాలన్న కోరిక పుట్టడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అలాగే రోజు దొరికే జబర్దస్త్ లాంటి కామెడీ షోతో కుటుంబమంతా ఇంట్లో కూర్చొని ఖర్చులేకుండా ఫ్రీగా దొరికే కామెడీతో ఆనందంగా ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు “@నర్తనశాల” సినిమాకు వెళ్లిన వారికి పార్టీకి వెళ్లినా ఈ చీప్ మందు గోల ఏమిటిరా బాబు అనుకునేలా సినిమాను దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి తీసిన విధానంతో మన మీద మనమే కామెడీ పంచ్ లు వేసుకోకుండా ఉండలేం.

ఒక మగాడికి(మాడగా మారిన) ఇంకో మగాడు లైన్ వేస్తాడన్న చిన్న లైన్ తో ఎంత కామెడీనైనా పిండుకోవచ్చు. కామెడీ పండించాలంటే చిన్న పాయింట్ చాలు, ఆ చిన్న పాయింట్ పట్టుకొని కామెడీతో పిండి పిప్పి చేయడానికి. ఇలాంటి స్టోరీ లైన్ అప్పట్లో ఇవివి సత్యనారాయణ, ఇప్పటి దర్శకుడు మారుతి చేతికి దొరికితే కావలసినంత కామెడీ పండించి ప్రేక్షకులను నవ్వుల జల్లులలో ముంచి అద్భుతమైన సినిమా తీసేవారు. కానీ ఇలాంటి లైన్ ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయడంతోనే సినిమా రివర్స్ గేర్ వేసింది.

“@నర్తనశాల” సినిమాను గే పాయింట్ తో సినిమా తీస్తున్నారని సినిమా ప్రమోషన్స్ లోనే ప్రేక్షకుడు ఒక అంచనాకు వచ్చేలా చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది. కానీ కొత్త దర్శకుడు కావడం గే అనే పాయింట్ పట్టుకొని సినిమా రెండునర్ర గంటలు ఎలా నడపాలో తెలియక మొదటి అర్ధభాగం హీరో మహిళా లోకాన్ని తాను అండగా ఉన్నానంటూ మోటివేషన్ ఇచ్చే కార్యక్రమాలతో పాటు, హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన సీనియర్ నటుడు శివాజీ రాజా తిక్క వేశాలు, సత్యం రాజేష్ ల కామెడీ సీన్స్ తో మొదటి భాగం లాగించేసారు. మొదటి అర్ధం భాగం కామెడీ బాగోలేదు అని చెప్పుకోవడానికి లేదు, రోజు పెంచే పెట్రోల్, డీజిల్ రేట్లు ఎప్పుడో ఒకసారి పది పైసలు తగ్గిస్తే ఎలా ఉంటుందో కామెడీ కూడా అప్పుడప్పుడు అలా అలా నవ్వులు పూయించారు.

ఒక మగాడిని ఇంకో మగాడు ప్రేమించే క్యారెక్టర్ లో నాగశౌర్యకు జోడిగా నటించిన అజయ్ కి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరికింది. రఫ్ లుక్ తో ఉంటూనే అజయ్ దానికి తగట్లు కామెడీతో కొంత మేర ఆకట్టుకున్నాడు. హీరో తండ్రి పాత్రలో చేసిన శివాజీ రాజా ఈ సినిమా తరువాత తాను అవకాశాల జడివానలో తడిసి ముద్దవ్వాలని గట్టిగా తలచి తన ఓవర్ యాక్టింగ్ తో ప్రేక్షకుడికి విసుగు తెప్పించాడు. జయప్రకాశ్ రెడ్డి, సుధా, ప్రియా క్యారెక్టర్స్ రొటీన్ గా సాగుతాయి.

“@నర్తనశాల” హీరో నాగశౌర్య ఏమాత్రం ఇబ్బంది పడకుండా గే పాత్రలో చాల చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా సిగ్గు పడుతూ తన బొటన వేలితో ముగ్గువేసే సీన్ లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించాడు. అలాంటి సీన్స్ మరొక ఒకటి, రెండు ఉంటె బాగుండేది. “చలో” సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో నాగశౌర్య తరువాత వచ్చిన “కణం, అమ్మమ్మగారిల్లు” సినిమాలు వరుస ప్లాపులు రావడంతో తన సొంత బ్యానర్ లో అయితే సరైన హిట్ సినిమా తియ్యగలనని ఖర్చుకి వెనకాడకుండా తీసి చివరకు “@నర్తనశాల” సినిమా ప్లాప్ తో ఆ ఖర్చులే మిగుల్చుకున్నాడు.

కథ పరంగా మంచి కామెడీ పండించే స్కోప్ ఉన్నా దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. తాను ఎంచుకున్న కథకు తాను పూర్తి న్యాయం చేయలేకపోయానని సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్న తరువాత దర్శకుడికి అర్ధమై ఉంటుందని భావిస్తున్నాను. ఇక హీరోయిన్స్ కాశ్మీర, యామిని భాస్కర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. “చలో” సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన “మహతి స్వర సాగర్” ఈ సినిమాతో పూర్తిగా తేలిపోయాడు. సొంత నిర్మాణ సంస్థ కావడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : విషయం తక్కువ హడావిడి ఎక్కువ
రేటింగ్ : 1.5/5
రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి