2013 లో విడుదలై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించిన “విశ్వరూపం” సినిమా సీక్వెల్ “విశ్వరూపం2” పురిటి నొప్పులను తట్టుకొని ఇన్ని రోజులకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది .

విశ్వరూపం మొదటి భాగమంతా కమల్ హాసన్ కథను అద్భుతంగా రాసుకొని, స్క్రీన్ ప్లేను పరిగెత్తిస్తాడు. “విశ్వరూపం” సినిమా వచ్చిన కొత్తలో “విశ్వరూపం2” సినిమా కోసం ప్రేక్షకులు అప్పట్లో చాల ఆసక్తి కనపరిచారు. కానీ ఇన్ని రోజులకు విడుదలైన “విశ్వరూపం2” సినిమా మొదటి పార్ట్ కు కొనసాగింపుగా ఉండటంతో మొదటి భాగం చూడని వారికి ఈ సినిమాలో ఏమి జరుగుతుందో అర్ధం చేసుకోవడం కొంత కష్టంగా మారుతుంది.

మొదటి భాగంలో న్యూయార్క్ మిషన్ విజయవంతంగా ముగించుకున్న విసామ్ ( కమల్ హాసన్) మరో మిషన్ కోసం లండన్ బయలు దేరతాడు. లండన్ లో బారి విధ్వంసానికి కుట్ర జరుగుతుందని తెలుసుకున్న కమల్ హాసన్, తన భార్య నిరుపమా(పూజ కుమార్), అష్మిత (ఆండ్రియా) సహాయంతో కలసి చేధిస్తాడు.

మొదటి భాగంలో కమల్ హాసన్ నుంచి తప్పించుకున్న ఆల్ ఖైదా ఉగ్రవాది ఒమర్ ఖురేషి (రాహుల్ బోస్) ఢిల్లీలో బ్లాస్టింగ్స్ ప్లాన్ చేస్తాడు, ఈ బ్లాస్టులను ఆధారంగా చేసుకొని “విశ్వరూపం2” కథను రూపొందించారు.

తొలి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ రెండవ భాగంలో పూర్తిగా లోపించింది. “విశ్వరూపం2” సీక్వెల్ లో ఇంటర్వెల్ లాంటి ఒకటి, రెండు సీన్స్ తప్ప మిగతా సినిమా అంతా ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాల కష్టమే. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది “విశ్వరూపం2” సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని విశ్వరూపం మొదటి భాగం సన్నివేశాలు కావడంతో సినిమా మీద అక్కడే ఆసక్తి సన్నగిల్లుతుంది.

సినిమాలో కథ, కథనంలో ఉన్న లోటు పాట్లు చాల స్పష్టంగా ప్రేక్షకుడికి అర్ధమైపోతాయి. మొదటి భాగంలో కమలహాసన్ గూఢచారి అని ఉగ్రవాది ఒమర్ ఎలా పసిగట్టాడో తెలుసుకోవడానికి “విశ్వరూపం2” కోసం దాచి పెట్టాడు. కానీ దానికి సంబంధించిన విషయాలు తీర్చిదిద్దటంలో పూర్తిగా విఫలమయ్యారు.

విశ్వరూపం మొదటి భాగంలో యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్ సీన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో చాల అమాయకంగా కనిపించే కమల్ హాసన్, విసామ్ గా మారి ఉగ్రవాదులను మట్టుబెట్టే సీన్ అద్భుతంగా పండింది. అలాంటి సీన్స్ రెండవభాగంలో లేకపోవడం చిత్రీకరణలో కనిపించే లోటు పాట్లు, ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. “విశ్వరూపం2” మొదలైన వెంటనే సినిమాపై ఆసక్తి కలిగించి అరగంట తిరగక ముందే దర్శకుడు కమల్ హాసన్ సినిమాను దారి తప్పిస్తాడు. కమల్ హాసన్ మీద సీక్వెల్ లో జరిగే కుట్రలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అన్ని తేలిపోతాయి. ఆ కుట్రలు నేపధ్యం అంతా కథకు దూరంగా ఉండటంతో ఆసక్తిని సినిమా పూర్తిగా చంపేస్తుంది.

ఇన్ని రోజుల నిరీక్షణ తరువాత డబ్బులు సమకూర్చుకొని ఎలాగైనా విడుదల చేయాలన్న తపన తప్ప గ్రాఫిక్స్ పై సినిమా నిర్మాతలు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. నాసి రకమైన గ్రాఫిక్స్ తో సినిమా చూసే ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెడతాయి. “విశ్వరూపం2” సినిమాలో విలన్ గా నటించిన రాహుల్ బోస్ చివరి అరగంట క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు.

లోకనాయకుడిగా పేరొందిన కమల్ హాసన్ “రా ఎంజెంట్” గా అద్భుతమైన నటన కనపరిచాడు. సినిమాలో కమల్ హాసన్ బాడీ లాంగ్వేజ్, డైలాగే డెలివరీ నిజంగా ఒక “రా ఎంజెంట్” చూస్తున్న ఫీలింగ్ తీసుకువచ్చాడు. కానీ కథ, కథనం తేలిపోవడంతో కమల్ హాసన్ ఇంత వయస్సులో పడ్డ శ్రమ అంతా వృధాగా మిగిలిపోతుంది. “విశ్వరూపం2” సినిమాలో హీరోయిన్ లుగా నటించిన పూజ కుమార్, ఆండ్రియాకు ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. తొలిభాగంలో మంచి సంగీతం అందించిన సంగీత దర్శకుడు గిబ్రాన్ సీక్వెల్ కూడా స్పై థ్రిల్లర్ కు కావలసిన మూడ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

చివరగా : మిషన్ సక్సెస్ – దర్శకుడు ఫెయిల్
రేటింగ్ : 2/5
రివ్యూ బై: శ్రీకాంత్ గుదిబండి