తెలంగాణ ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి తన సత్త చాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని చూసాడు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని నిలువునా ముంచాలని చూస్తే, చంద్రబాబు నాయుడు ఆలోచనకు విరుద్ధంగా టీడీపీ పార్టీతో పొత్తు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా మునిగిపోయింది. కానీ చివర వరకు చంద్రబాబు నాయుడు పెట్టిన టెన్షన్ తో టీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఆందోళన చెందారు. కానీ ఊహించని ఫలితాలు టీఆర్ఎస్ ఖాతాలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్నికల తరువాత కేసీఆర్ తాను చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని, నాకు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇస్తే, తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ టైమ్ ఆసన్నమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాషిణిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నిలబెట్టి సానుభూతి పవనాలతో తెలంగాణాలో నెగ్గుకురావాలని చూసారు. ఇక ఈ ఎన్నిక రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా కూడా మారింది. కానీ సుహాషిని దాదాపుగా టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణ రావు చేతిలో 40 వేల ఓట్ల పైచిలుకతో ఓటమి పాలైంది. సుహాషిని గెలిపించడానికి దాదాపుగా ఏపీ మంత్రి వర్గంతో పాటు, దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు కూకట్ పల్లిలో తిష్ట వేసినా ఆమె ఓటమిని ఆపలేకపోయారు. ఆ తరువాత సుహాషిని ఎక్కడ మీడియాలో కనపడిన దాఖలాలు కూడా లేవు.

ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్… హరికృష్ణ కూతురు సుహాషిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని సముచిత స్థానం కల్పించి గౌరవించాలని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా ఎమ్మెల్సీ స్థానం సుహాషిణికి కట్టబెట్టి చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ మొదటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సన్నద్ధమయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవేళ సుహాషిని కనుక టీఆర్ఎస్ పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీకి తీవ్ర అవమానమే గాక, బారి దెబ్బగా కూడా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు నందమూరి కుటుంబం నుంచే టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ప్రారంభమైతే ప్రజలకు ఏమి సంధానం చెబుతామని నందమూరి అభిమానులు బాధపడుతున్నారు.

చంద్రబాబు నాయుడు కూడా సుహాషిని ఓటమి తరువాత ఆమెను పట్టించుకోలేదని, అవసరానికి వాడుకొని వదిలేశారని, కూకట్ పల్లిలో సుహాషిని ఓటమి తరువాత ఆమెకు ఆంధ్రప్రదేశ్ లో అయినా ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవం కల్పిస్తే బాగుండేదని, కానీ నందమూరి హరికృష్ణను మోసం చేసినట్లు తన కూతురు సుహాషిని కూడా మోసం చేసారని ఆ కుటుంబం భావిస్తోందట. చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి కొంచెం తేడాగా ఉండటంతో, రాజకీయాలలోకి వచ్చిన తరువాత పదవి ఇస్తానంటే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం తప్పేమి కాదని సుహాషిని అలోచించి టీఆర్ఎస్ పార్టీ లో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ దెబ్బకు ఏపీలో కూడా తెలుగుదేశం కూసాలు కదలడం ఖాయం అని చెబుతున్నారు.