దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖాయమైంది. మార్చి 3న ఉదయం ఆరు గంటలకు నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్, వినయ్ వర్మ, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ లను ఉరి తీయాలంటూ ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు సోమవారం కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. ప్రస్తుతం వారున్న తీహార్ జైలులోనే వారిని ఉరి తీయనున్నారు. ఇప్పటికే ఈకేసులో ఉరి వాయిదా పడేలా నిందితులు అనేక ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి జనవరి 22నే వీరిని ఉరి తీయాల్సి ఉండగా దోషుల్లో ఒకడైన ముకేశ్ క్షమాబిక్ష పిటిషన్ రూపంలో శిక్ష అమలకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్రిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఢిల్లీ కోర్టు రెండవసారి డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే దీనికి రెండు రోజుల ముందు జనవరి 30న దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఉరి శిక్ష వాయిదా పడింది.

ఇక తాజాగా దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలుచేయాలంటూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయ స్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పటియాల కోర్టు దోషులను ఉరి తీయాలంటూ డెత్ వారెంట్లు జారీ చేసింది. కాగా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ సారైనా ఉరి శిక్ష అమలవుతుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •