అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో అక్కడ కొత్త నాయకుడిని ఎంపిక చేసే పని చంద్రబాబు నాయుడు తన తోడల్లుడు బాలకృష్ణకు అప్పగించాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పరిటాల కుటుంబం రాప్తాడుతో పాటు, ధర్మవరం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. చంద్రబాబు నాయుడు రాప్తాడు ఒక్క టికెట్ ఇచ్చి, ధర్మవరం నుంచి 2014 ఎన్నికలలో గెలిచిన సూరికే కేటాయించారు. కానీ వరదాపురం సూరి ఓడిపోవడంతో పాటు వైసీపీ అధికారాన్ని చేపట్టడంతో వరదాపురం సూరి తన ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలో చేరాడు. 

ఇక రాప్తాడు బాధ్యతలు పరిటాల సునీత, ధర్మవరం బాధ్యతలు పరిటాల శ్రీరామ్ కు అప్పగించే సూచనలు కనపడుతున్నాయి. వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో అడుగుపెట్టాలనుకున్న పరిటాల కుటుంబం ఆటలు సాగనియ్యలేదు. పరిటాల కుటుంబం ఎంత ప్రయత్నించినా దక్కని ధర్మవరం టికెట్ ఇప్పుడు నేరుగా గుమ్మం ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానం కోరడంతో పరిటాల కుటుంబం తన పట్టు నిలుపుకోవడానికి మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. ఈనెల 8వ తారీఖున చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంపై పూర్తి స్పష్టత రానుంది. బాలకృష్ణ ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో లోకల్ నాయకులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •