అమెరికాలో జరుగుతున్న తానా వేడుకలలో పాల్గొనడానికి  వెళ్లిన పవన్ కళ్యాణ్ అన్ని పార్టీల నేతలతో చర్చోపచర్చలలో మునిగిపోయారని, పవన్ కళ్యాణ్ ఈసారి ఏపార్టీతో కలసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు హడావిడి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తానా వేడుకలకు అన్ని పార్టీల నుంచి నేతలు హాజరై… తెలుగు రాష్ట్రాలలో వారి వారి పార్టీల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా… పొరుగు దేశంలో కలసి మెలిసి తిరుగుతూ షాపింగ్స్ గట్రా చేస్తుంటారు.

అలానే పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎదురు పడిన నాయకులను పలకరించడంతో… పవన్ కు వారికి మధ్య రాజకీయ మిత్రత్వంపై డిస్కషన్ ఏవో నడిచాయని, ఒకరేమో బీజేపీకి వెళ్ళబోతున్నాడని… మరొకరేమో తిరిగి చంద్రబాబు నాయుడుతో కలసి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి పావులు కదుపుతున్నారని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్లి పవన్ కళ్యాణ్ తానా వేడుకలో పాల్గొనేలా చేయడానికి కోట్ల రూపాయలు చేతులు మారాయని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 

కానీ జనసేనకు చెందిన వర్గాలు మాత్రం తానా వేడుకను జరిపే నిర్వాహకుల రిక్వెస్ట్ మీదకే పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లాడని… ఎన్నికల కన్నా ముందే పవన్ కళ్యాణ్ కు ఇన్విటేషన్ వచ్చిందని… ఎన్నికల ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ తానా వేడుకలకు వెళ్లకూడదని అనుకున్నా… తానా సబ్యులకు ఇచ్చిన మాటను కాదనలేక అమెరికా వెళ్లారని చెబుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది నిజమో… ఏది అబద్ధమో తెలుసుకునే సమయం కూడా ఇవ్వకుండా నెటిజన్లు ఆయా నాయకుల తలకు బొప్పి కట్టేలా చేస్తున్నారు.