పవన్ కళ్యాణ్ మొదట్లో రాజకీయాలలోకి వచ్చినప్పుడు అన్ని కులాలను సమానంగా చూసే విధంగా రాజకీయాలు చేస్తానని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసాడు. ఈ మధ్య కాలంలో ఏదో ఒక సందర్భంలో కులాల గురించి మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ముందుకు వెళుతున్నాడు. ఒకసారి నేను కాపుని కాదు అంటాడు. కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి నేను కాపునే మీ వాడినే అంటాడు. మరొకసారి అసలు జగన్ మోహన్ రెడ్డి అసలు రెడ్డినేనా అని ప్రశ్నిస్తాడు..

ఇప్పుడు కొత్తగా అసలు రెడ్డి అనే కులమే లేదని మాట్లాడుతూ కులాల మధ్య కుంపులాటకు తెరతీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్ధం కాక, జనసేన పార్టీలోనే ఒక స్థబ్ధత నెలకొని ఉందని తెలుస్తుంది. ఎన్నికలు ముగిసిన తరువాత అందరూ ప్రశాంతంగా విహార యాత్రలు చేస్తున్న వేళ, పవన్ కళ్యాణ్ రెడ్డి కులం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

మరో వైపు పవన్ కళ్యాణ్ రెడ్ల గురించి మాట్లాడుతూ అసలు విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నాడని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీనివాసుని నగలు తీసుకొని వెళుతున్న ఒక వాహనం తమిళనాడులో పట్టుబడింది. ఆ వాహనానికి సరైన సెక్యూరిటీ లేకుండా నగలు ఎక్కడకి తరలిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ విషయం మీద వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలతో పాటు నెటిజన్లు తెలుగుదేశం పార్టీ వైపు వేలెత్తి చూపెడుతున్నారు.

ఇంత హాట్ టాపిక్ నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో బంగారం విషయం పక్కకు వెళ్లి కులాల మధ్య కుమ్ములాటలకు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది.వైసీపీ ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం – జనసేన రెండు పార్టీలు లోపాయికారంగా పనిచేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. శ్రీవారి నగలు 1381 కేజీలు పక్క దారి పడుతున్న విషయం అన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు రేకెత్తిస్తూ తెలుగుదేశం పార్టీ వైపు వేలెత్తి చూపెడుతుంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం తనకు ఆ విషయంతో ఏమి పనిలేదనట్లు వ్యవహరిస్తూ, ప్రజల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇలాంటి రాజకీయాలు సమాజానికి చేటు చేసేవిగా మిగలడమే తప్ప, ఏమాత్రం మంచి చేయవన్న విషయం పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచింది.