తెలంగాణ యువత పోరాట స్ఫూర్తిని, పోరాటాన్ని, త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని కనుకే తనకు తెలంగాణ అంటే అంత గౌరవమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ముందస్తు ఎన్నికల వల్ల సమయం లేని కారణంగా తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయలేక పోయామన్నారు. ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని కొద్దిరోజుల క్రితం పేర్కొన్న పవన్‌ కళ్యాణ్.. తాజాగా ఓ వీడియో సందేశాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఆ వీడియో సందేశంలో తెలంగాణ ఇచ్చామని, రాష్ట్రాన్ని తెచ్చామని, తెలంగాణను పెంచామనే వాళ్లు ప్రస్తుత ఎన్నికల్లో మన ముందున్నారని, వారిలో ఎవరికి ఓటు వేయాలనే అయోమయం ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. అత్యంత ఎక్కువ పారదర్శకత, అత్యంత తక్కువ అవినీతితో ఎవరైతే మెరుగైన పాలన ఇవ్వగలరని భావిస్తారో వారికే ఓటు వేయాలని, దీనిపై ప్రజలంతా లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తద్వారా తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆయన కోరారు.