పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే సమయంలో తాను సినిమాలు చేయనని, ఇక పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితమని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికలు ముగిసి ఫలితాలలో జనసేన పార్టీతో పాటు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా ఓడిపోవడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీకి వస్తాడని అభిమానులు ఎంతో ఆశించారు.

ఇక అభిమానులతో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొంత మంది నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని ఉన్నారు. వారిలో హారిక హాసిని, మైత్రి మూవీస్ తో పాటు మరొక రెండు, మూడు సంస్థలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఎన్నికల ముగిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అదిగో సినిమా, ఇదిగో సినిమా అంటూ రోజుకొక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన ప్రతిసారి తాను ఇప్పటికే సినిమాలను ముగింపు పలికానని, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినని సెలవిస్తూనే ఉన్నారు.

కానీ మరి నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లు ఇంకా ఎందుకు తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు అంటే దానికి సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ తీసుకున్న అడ్వాన్స్ లు చిన్నా చితకావి కాదు, అన్నీ కోట్లలో వ్యవహారమే… వాటికి వడ్డీల భారంతో పాటు నిర్మాతలకు తడిసిపోతుంది. కానీ వారు పవన్ కళ్యాణ్ ను నేరుగా అడగలేరు, పవన్ కళ్యాణ్ పిలిచి ఇస్తానని చెప్పలేడు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తమకే సినిమా చేస్తాడన్న ఆశ మాత్రం వారిలో అలా ఉండిపోతుంది. ఆ నిర్మాతలకు ఆశ ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ ఇస్తానని చెప్పడు, వారు ఇవ్వమని అడగరు. వ్యవహారం మాత్రం ఎటూ తేలకుండా అలా నలిగిపోతూనే ఉంటుంది.