రామచంద్రపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాలుగు రోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తోట త్రిమూర్తులు ఇప్పటికి ఎప్పటికి తన శత్రువే అని డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తోట వైసీపీలో చేరడం రామచంద్రపురంలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీనితో బుధవారం పిల్లి సుభాస్ చంద్రబోస్ కాన్వాయి ని అడ్డగించారు. వెంకటాయపాలెం శిరోముండనం దళితుల కేసులో తోటను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు కోరాయి. ఆయనను తక్షణం అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పట్టుపట్టారు. ఈ ఘటనపై పిల్లి సుభాస్ చంద్రబోస్ వారితో మాట్లాడుతూ.. తోట వైసీపీలోకి వచ్చినంత మాత్రాన ఆయనను వదిలేది లేదని తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు.

వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంభందించి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని చెప్పారు. అవసరం అయితే బాధితులను సీఎం జగన్ దగ్గరకు తీసుకుని వెళ్లి న్యాయం చేస్తానని పిల్లి హామీ ఇచ్చారు. పిల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు నాలుగు రోజుల కిందటే పార్టీలో చేరిన తోటని కలుపుకుని పని చేస్తానని చెప్పిన పిల్లి.. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.