కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి రావడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఒకొక్కరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ముందుగా వట్టి వసంత కుమార్ బయటకు రాగా, ఆ తరువాత వట్టి దారిలో మాజీ మంత్రులు  సి.రామచంద్రయ్య, పసుపులేటి బాలరాజులు బయటకు వచ్చారు. ఇక రేపో మాపో చిరంజీవి కూడా తట్టా, బుట్టా సర్దుకొని కాంగ్రెస్ కు రామ్ రామ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన పసుపులేటి బాలరాజు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోయారు. ఇక సి.రామచంద్రయ్య ఈ నెల 13 న వైఎస్ జగన్ సమక్షంలో వైసిపి కండువా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

అందరి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వట్టి వసంత కుమార్ మాత్రం ప్రస్తుత రాజకీయాలను గమనిస్తూ, సైలెంట్ గా ఉన్నారు. వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే గతంలో ఒకసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో వట్టి త్వరలో జనసేనలోకి చేరబోతున్నదంటూ పుకార్లు… షికార్లు చేసాయి. కానీ తరువాత వట్టి వసంత కుమార్ అనుచరులు అలాంటిదేమి లేదని చెప్పి కండించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు రావడంతో, ఏదో ఒక ఫ్లాట్ ఫార్మ్ వెతుక్కోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. రాజకీయ నాయకుడికి సమయానికి తినడానికి తిండి దొరకకపోయినా, ఏదొక పార్టీలో చేరకుండా ఖాళీగా కూర్చోవడానికి మాత్రం ఇష్టపడడు. అలానే వట్టి కూడా త్వరలో మా పార్టీలో చేరుతాడంటే, మా పార్టీలో చేరుతాడంటూ వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కానీ చూస్తుంటే, వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతుండటంతో పాటు, వైఎస్ జగన్ తో వట్టికి ఉన్న పరిచయాలు వట్టి వసంత కుమార్ ను వైసిపి వైపు తన కొత్త రాజకీయ అడుగులు వేసేలా చేస్తున్నాయని, వట్టి అనుచరులు కూడా వైసిపి నుంచి వచ్చే ఎన్నికలలో రాజకీయాలు షురూ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఒకవైపున జనసేన పార్టీ నుంచి కూడా మంచి ఆఫర్ ఉండటంతో వట్టి వసంత కుమార్, ఏపార్టీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్ మరొక పదేళ్ల పాటు దివ్యంగా ఉంటుందనే దానిపై తీవ్ర ఆలోచనలో పడట్లు తెలుస్తుంది. వట్టి వసంత్ కుమార్ ఏపార్టీలో చేరినా ఆ పార్టీకి ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో కొంత బూస్టింగ్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. వట్టి రాక కోసం రెండు పార్టీలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వట్టి వసంత కుమార్ నిర్ణయం… ఇదే నెలలో తెలియచేసి ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారని వట్టి అనుచరుల ద్వారా తెలుస్తుంది.