కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైసీపీ నేతలు కలిశారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై వైజాగ్ లో కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. జగన్ పై జరిగిన ఈ హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్త సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వరప్రసాద్‌ హోంమంత్రిని కలిశారు. అలాగే తిట్లీ తుఫాను బాధితులకు కూడా సహాయం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీన వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం గురించి వివరించటం జరిగిందని తెలిపారు. ఈ ఘటన అనంతరం చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును ఆయనకు వివరించామన్నారు. ఈ విషయంపై రాజనాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారన్న వైసీపీ నేతలు.. కేసును పరిశీలిస్తానని, కేంద్రం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడుతుందన్నారని చెప్పారు. అలాగే జగన్‌కు తగినంత భద్రత కల్పించాలని.. ఆపరేషన్‌ గరుడ వెనుక ఎవరున్నారు.. ఎవరు చేయిస్తున్నారు.. ఏ విధంగా పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారో విచారణ చేయాలని కోరామన్నారు.