తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది… పర్లేదు అయినా జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఏమాత్రం తగ్గకుండా తమ దారి తాము చూసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పేరుపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ముందుగా పొంగులేటి గురించి చెప్పుకోవాలంటే 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టినప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లతో పాటు, సీట్లు కూడా తెలంగాణ వేడిలో వచ్చే అవకాశం లేకపోయినా… ఒక్కడిగా నిలబడి టీఆర్ఎస్ నేతలతో కలబడి ఖమ్మం ఎంపీ స్థానం నుంచి గెలుపొంది తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ స్థానాన్ని ఇచ్చి జగన్ రుణాన్ని తీర్చుకున్నాడు.

అలాంటి నేత తరువాత రోజులలో టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నామా నాగేశ్వర రావును చేరదీసి పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వడంతో కొంత అలకపాన్పు ఎక్కారు. కానీ కేసీఆర్ సర్ది చెప్పడంతో నామా గెలుపు కోసం కృషి చేసారు. ఇక ఇప్పుడు మరో మారు గత ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర రావుకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావించడంతో పాటు…. తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని వార్తలు రావడంతో పొంగులేటి ఈసారి ఏకంగా పార్టీనే మారాలని నిచ్ఛయించుకున్నారట.

ఎంపీగా ఉన్న తనను పక్కకు తప్పించి కమ్మ సామజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలను ఖమ్మం జిల్లాలో పెంచి పోషించడంతో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి నచ్చడం లేదట. అందుకే తన దారి తాను చూసుకునే క్రమంలో ఇప్పటికే బీజేపీ నాయకులతో సంప్రదింపులు పూర్తి చేశారట. బీజేపీ కూడా ఖమ్మం జిల్లాలో బలమైన నేత కావడంతో పొంగులేటిని బీజేపీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతుంది. కమ్మ నేతలకు అందలం ఎక్కిస్తూ రెడ్డి నేతలను తొక్కేస్తున్నారని పొంగులేటి భావించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది.

కానీ కేసీఆర్ తెలంగాణాలో రెడ్లకు తగిన ప్రాధాన్యత అన్ని జిల్లాలలో కల్పించారు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ ఉండటంతో నామా, తుమ్మల సీనియర్ నేతలు కావడంతో వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ ఏమైనప్పటికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాత్రం తాను కోరుకున్న గౌరవం దక్కలేదన్న ఆక్రోశంతో బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఏమైనా చొరవ తీసుకొని పొంగులేటిని ఆపే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •