ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో కొంతమంది తల్లితండ్రులు తీసుకునే నిర్ణయంతో ఆ నిండు జీవితాలు మొగ్గలోనే తుణిగిపోతున్నాయి. గతంలో నల్గొండలో జరిగిన ఇన్సిడెంట్, గత రెండు వారాల క్రితం హైదరాబాద్ లో జరిగిన దాడులతో ప్రేమించి పెళ్లిచేసుకునందుకు యువకులను యువతి తల్లితండ్రులు చంపివేసిన ఘటనలు సంచలనం కలిగించాయి. అలాంటి సంఘటన ఇప్పుడు నిర్మల్ జిల్లా బైంసాలో చోటుచేసుకుంది.

ఇద్దరు ప్రేమికులు ఇంట్లో వారిని కాదని గత ఏడాది మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారిద్దరూ కాపురం పెట్టి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో యువతి తరుపు తల్లితండ్రులు ఆమె తమను కాదన్న వాడిని పెళ్లి చేసుకునేందుకు తట్టుకోలేకపోయారు. దీనితో గత నెలలో యువతి తల్లికి గుండె నొప్పి వచ్చిందని ఆమెను పిలిపించగా ఆమె వచ్చిన తరువాత అతడితో ఉండటానికి వీలులేదని, విడాకులు తీసుకోవాలని బలవంతం చేస్తారు. దీనితో తన తల్లి కోసం ఇంట్లో వారి మాటలకూ తలొగ్గి విడాకులకు ఒప్పుకుంది. అప్పటి నుంచి ఆ యువతి వారి ఇంటి దగ్గరే ఉంటుంది.

డిగ్రీ పరీక్షలు రాసేందుకు కల్లూరులోని వాసవి కళాశాలకు వెళ్లిన సమయంలో ఆ యువతి తాను ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడితో మాట్లాడటంతో పాటు అతడి బైక్ పై వెళుతుండటం చూసిన ఆమె సోదరులు తట్టుకోలేక వారిద్దరిని చంపేయాలని వెనుక నుంచి కారుతో వచ్చి డీ కొట్టారు. ప్రమాదంలో యువతి నాగజ్యోతి తీవ్రంగా గాయపడగా యువకుడు అక్షయ్ పై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలయినా వారు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమను కాదని పెళ్లి చేసుకున్నదని చంపేయడానికి కూడా కొంతమంది తల్లితండ్రులు వెనకాడటం లేదు.