మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ రధ సారధి రాహుల్ గాంధీ ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికలు వదిలి పెట్టి అలా ఎందుకు వెళ్లారని అడిగే ధైర్యమైతే కాంగ్రెస్ లో ఏ ఒక్క వృద్ధ, యువ నాయకుడు అడిగే సాహసం చేయడు. ఇక అతడు వెళ్లడంతో ఎవరకి వారు తమ పార్టీ ప్రచార పనులలో మునిగిపోయి ముమ్మరంగా తమకే ఓట్లు వేయాలంటే.. తమకే వేయాలని ఓటర్ దేవుళ్ళ దగ్గర ప్రాధేయపడుతున్నారు.

ఇక ఎన్నికలై పోయాక వస్తాడనుకున్న రాహుల్ గాంధీ ఎట్టకేలకు మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులను కరుణించాడు. రెండు రోజుల పాటు తన అమూల్యమైన సమయాన్ని కేటాయించడానికి సిద్ధమయ్యాడు. రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఉంటారని ముంబై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఏక్ నాధ్ గైక్వాడ్ తెలిపారు., మాకు ఆ రెండు రోజులే చాలని, ప్రధాని మోదీ ఎందుకు ఎక్కువ రోజులు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదని గైక్వాడ్ అన్నారు.

రాహుల్ గాంధీ మహారాష్ట్ర లాంటి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ కనపడకుండా ఫారిన్ జంప్ కొట్టడంతో కాంగ్రెస్ నాయకులు ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక మా రాహుల్ గాంధీ రెండు రోజులు ప్రచారం చేస్తే అదే ఎక్కువని… సూపర్ డూపర్ విక్టరీ సాధిస్తామని బీరాలు పలుకుతున్నారు. అసలు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచే సీన్ లేదనే రాహుల్ గాంధీ అలా చెప్పా పెట్టకుండా ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడని, కాంగ్రెస్ వృద్ధ నాయకులు బతిమిలాడి, బుజ్జగించుకొని ఒక రెండు రోజులు ప్రచారానికి పిలిపించుకున్నట్లుంది. ఇక రాహుల్ గాంధీ రెండు రోజులలో ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతారో… ఆ అదృష్టం ఎవరని వరించనుందో.