రాజధాని ఢిల్లీ ఝాన్సీ రోడ్డులో ఈ రోజు తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌మండీ ప్రాంతంలో ఓ భహుళ అంతస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 35 మంది మరణించారు. మరో 50 మందిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. మరో 20 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.

మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో 30 ఫైర్ ఇంజిన్ లు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. అయితే దీనికి గల కారణాలు తెలియలేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆదివారం తెల్లవారు జామున 5.20 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. భవనంలో స్కూల్ బ్యాగులు, బాటిళ్లు సహా మరో కొన్ని ఇతర చిన్న సామగ్రి తాయారు చేసే కుటీర పరిశ్రమ ఉన్నట్లు తెలుస్తుంది. కార్మికులంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం వాళ్ళ ప్రాణనష్టం ఎక్కువుగా జరిగినట్లు చెబుతున్నారు.