థ్రిల్లర్ మూవీస్ తో వచ్చే చిక్కల్లా ఒక్కటే, ఒకసారి సినిమాను చూస్తే మరో సారి సినిమా బాగున్నా చూడాలనిపించదు. కథ రివీల్ అయ్యాక ఒకసారి చూసిన సినిమా మరోసారి చూడాలని ఉన్నా థ్రిల్లర్ సినిమాలలో ఎలాంటి కామెడీ సీన్స్ ఉండకపోవడంతో బోర్ గా ఫీల్ అవుతారు. ఇక ఈవారం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన “రాక్షసుడు” సినిమాకు కూడా ఇలాంటి చిక్కే ఉంది. సినిమా మొత్తం ఆధ్యంతం మెప్పిస్తుంది. మనల్ని మునివేళ్లపై నుంచోపెట్టేలా సినిమాలో తరువాత ఏమి జరుగుతుందా? అన్న ఇంటెన్షన్ ఉంటుంది.

కానీ ఇలాంటి సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంటాయి. ఇక తాను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుని క్రైమ్ స్టోరీస్ మీద వర్క్ చేస్తున్న హీరోకు అవకాశాలు రాక పోలీస్ ఆఫీసర్ గా సెటిలవుతాడు. ఒక కేసుపై వర్క్ మొదలుపెట్టిన హీరో ఎలా తన టాలెంట్ చూపించాడన్నది ఆధ్యంతం ఆకట్టుకుంటుంది.  

హర్రర్, సైకో థ్రిల్లర్ సినిమాలకు భాషతో పని ఉండదు. ఏ బాష అయినా అలాంటి సినిమాలు నచ్చేవారు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కూడా అదే కోవకు చెందుతుంది. ఇప్పటికే పోలీస్ క్యారెక్టర్ గా ఒక సినిమా చేసిన బెల్లంకొండ “రాక్షసుడు” సినిమాలో ఇంటెన్సివ్ తో చాలా బాగా చేసాడు. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో మరి కొంత ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి స్కోప్ దొరికింది. తన వరకు సినిమాకు పూర్తిగా న్యాయం చేసాడనే చెప్పుకోవచ్చు. 

తమిళంలో రిలీజై సూపర్ హిట్ సాధించిన “రాక్షసన్” సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు దింపేశారు. ప్రొడ్యూసర్స్ కూడా సినిమాలో మార్పులు చేర్పులు చేస్తే తేడా కొట్టేస్తుందేమో అని భయపడినట్లు ఉన్నారు. ఇప్పటికే తమిళంలో సినిమా చూసినవారికి ఈ సినిమా అంతగా అక్కట్టుకోదు. కానీ మొదటి సారి “రాక్షసుడు” సినిమా చూస్తున్నవారిని మాత్రం కాస్త భయపెట్టి టెన్షన్ కు గురి చేస్తాడు.

సినిమాకు సంగీతం అందించిన గిబ్రాన్ ప్రాణం పోశాడు. అద్భుతమైన నేపధ్య సంగీతంతో సినిమాను ఎలివేట్ చేసేలా ఉంటుంది. ఇక హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ తక్కువ నిడివి గల క్యారెక్టర్ అయినా టీచర్ గా ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా రాజీవ్ కనకాల మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ పండించడంలో సిద్ధహస్తుడైన రాజీవ్ కనకాల తన అనుభవంతో రక్తి కట్టించాడు. మంచి నిర్మాణ విలువలతో సినిమాను నిర్మాతలు అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు… తమిళ సినిమాను పక్కాగా ఎటువంటి తప్పులకు తావు ఇవ్వకుండా తీర్చి దిద్దడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

చివరిగా : భయపెట్టిన రాక్షసుడు 

రేటింగ్ : 2.75/5 

రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి