ఎప్పుడు ప్రజలతో మమేకమై, నీటిపారుదల ప్రాజెక్ట్స్ మీద తనకున్న అనుభవాన్ని రంగరించి రాప్తాడు కోసం ఏదో చేయాలని పరితపించే వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేతో పాటు అతడి గన్ మ్యాన్, ఇద్దరు కుటుంబసభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీనితో వారు హోమ్ ఐషాలేషన్ లో ఉంటున్నారు.

ఇక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న మరొక 16 మందికి టెస్టులు చేయగా వాటి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే శృంగవరపుకోట, కోడుమూరు ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రజలతో మమేకమవుతూ ఉండే ఎమ్మెల్యేలకు, ఏదో ఒక పని మీద ఎప్పుడు ఎమ్మెల్యేల దగ్గరకు రావడం వారు కాదనలేక వారిని కలవడంతో ఇలా కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణలో కూడా ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ విజ్రంభించడంతో పాటు హైదరాబాద్ నగరంలో అయితే మరింత ఎక్కువగా ఉండటంతో లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజులలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.