మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా 15 రోజులు దాటుతున్నా ఇంకా అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో ఉత్కంఠతగా మారింది. రేపటిలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. మరోవైపున ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ – శివసేన రెండు పార్టీలు వెనక్కు తగ్గకపోవడంతో రెండు పార్టీలలో అలజడి మొదలయింది. ఈ పరిణామాలతో శివసేన పార్టీకి రెండునర్ర ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు బీజేపీ అధినాయకత్వం ససేమీరా అంటుంది.

దీనితో రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లి మరల ఎన్నికలు తెచ్చుకోవడంతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగారు. ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది. మరోవైపున శివసేన ఎంపీ సంజయ్ రౌతు మాత్రం తమ పార్టీ నేత ఆదిత్య థాక్రేనే సీఎం అవుతారని చేస్తున్న వ్యాఖ్యలు హీటెక్కిస్తున్నాయి.

శివసేన మాత్రం తమతో కయ్యానికి కాలు దువ్వుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి స్థానం దక్కకుండా చూడాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాలతో ఈరోజు హుటాహుటిన నితిన్ గడ్కరీ ముంబై చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ పరిణామాల నుంచి బయట పడాలంటే నితిన్ గడ్కరీని మహారాష్ట్ర సీఎంగా చేస్తే శివసేనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, నితిన్ గడ్కరీని సీఎంగా నియమించి శివసేన – బీజేపీ మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నారు. శివసేనకు కూడా గడ్కరీ కావలసిన వాడు కావడంతో పాటు అతడితో మంచి సంబంధాలు ఉండటంతో దేవేంద్ర ఫడ్నవీస్ కు దక్కకుండా నితిన్ గడ్కరీకి సపోర్ట్ చేసి వారి ఈగో చల్లార్చుకోవాలని చూస్తున్నారు.