నాగర్ కర్నూల్ జిల్లా మల్లాపూర్ తండా చౌరస్తా నుంచి 32 కిమీల దూరంలో దట్టమైన అడవులలో ఉంది సలేశ్వర క్షేత్రం. క్రూర మృగాలు, వన్యప్రాణులు సంచరించే ఈ ప్రాంతానికి మాములు రోజులలో ఎవరు వెళ్లే సాహసం చేయరు. ప్రతి ఏటా అటవీశాఖ అనుమతితో భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. చైత్ర పౌర్ణమికి రెండు రోజుల ముందు, రెండు రోజుల తరువాత ఇలా మొత్తం ఐదు రోజులు మాత్రమే ఈ జాతర జరుగుతుంది.

సలేశ్వరం క్షేత్రానికి వెళ్లే దారిలో ఫరహాబాద్ చౌరస్తా నుంచి 10 కిమీ దూరంలో నిజాం కాలం నాటి శిధిల భవనాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రకృతి అందాలు మెచ్చిన నిజాం రాజు ఇక్కడ వేసవి విడిదిని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ కూడా ఆశ్రమం పొందాడని చరిత్ర చెబుతుంది.

నిజాం విడిది నుంచి 22 కి.మీల దూరంలో సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. ఆక్కడ నుంచి సలేశ్వరం బేస్ క్యాంప్ నుంచి సలేశ్వరం జలధారులకు చేరేందుకు 2 కిమీలు నడవాలి. అల్కడ రెండు ఎతైన గుట్టల మధ్య లోతైన లోయలోకి దూకుతూ సలేశ్వరం జలపాతం భక్తులకు కనువిందు చేస్తుంటుంది.

అక్కడ నుంచి తూర్పు వైపునున్న గుట్టలో అరకిలోమీటరు కిందకు దిగి దక్షిణం వైపు ఉన్న గుట్ట చివరకు కిలోమీటర్ కిందకు నడవాలి. అక్కడ నుంచి గుట్టల మధ్య లోయలోకి దిగితే సలేశ్వర క్షేత్రం కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి చేరడం కొంత ఇబ్బందైనా ఇక్కడ ప్రకృతి అందాలు జలధారలు అలరిస్తాయి.

గుడి దగ్గర గుండంలోకి వందల అడుగుల ఎత్తు నుంచి జలధార దూకుతూ కనిపిస్తుంది. జలధారలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిని తాగడం భక్తులు పుణ్యంగా భావిస్తారు. జలధార కింద కుండం పక్కనే ఉన్న గుహలో లింగమయ్య స్వామి కొలువై ఉన్నారు. స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తుంటారు.

గుడి ముందు వీర భద్రుడు గంగమ్మ విగ్రహాలు దర్శించుకోవచ్చు. ద్వారబంధంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం కొలువై ఉంటుంది. ద్వారం ముందు రెండున్నర్ర అడుగుల వీరభద్రుడి విగ్రహం నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలతో దర్శనం ఇస్తుంది.

వీరభద్రుని కింద వినాయకుడు స్త్రీ మూర్తి ప్రతిమలు కనపడుతాయి. ఆక్కడే రాతి గోడపై బ్రహ్మ లిపిపై శాసనాలు కనిపిస్తాయి. మరో గోడపై ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండు విష్ణు కుండలి శాసనాలుగా చరిత్ర కారులు చెబుతున్నారు.

ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ లింగమయ్య దేవాలయాన్ని చెంచులు కనుగొన్నారు. చెంచులు ఆహారసేకరణ కొరకై అడవి నుంచి వస్తుంటే వారికి ఎక్కడా నీటి చుక్క కూడా దొరికేది కాదు. చెంచులతో పాటే ఉండే కుక్కలు అడవి మొత్తం తిరుగుతూ ఈ ప్రాంతంలో నీరు ఉందని పసిగట్టి నీరు తాగడానికి ఏ ఈప్రాంతానికి వస్తుండేవి. చెంచులు కూడా ఈ నీటి ప్రాంతానికి వచ్చే క్రమంలో ఇక్కడ ఒక దేవాలయం ఉందని కనుగొన్నారు. ఇక్కడ దేవాలయాన్ని కనిపెట్టిన తరువాత కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెంచులు ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇది చాల ప్రమాద ప్రాంతం కావడంతో ఇక్కడకి రారు.

రాళ్ల మార్గంలో వస్తున్న భక్తులు వస్తున్నాం… వస్తున్నాం లింగమయ్యో అంటు వస్తారు. దర్శనం ముగిసిన తరువాత పోతున్నాం… పోతున్నాం లింగమయ్యో అంటు తిరిగి ప్రయాణం మొదలుపెడతారు.

అక్కడ ఉన్న కొంత మంది భక్తులు చెబుతూ కోరిన కోర్కెలు తీరుతాయని అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడకు వస్తామని చెబుతున్నారు.

మరి కొంత మంది భక్తులు చెబుతూ ఇక్కడ పూజ కార్యక్రమాలన్నీ చెంచులే చూసుకుంటారని, ప్రభుత్వం కూడా గుడి నిర్వహణపై దృష్టి పెట్టి, పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చేబుతున్నారు.

సలేశ్వరం దర్శనానికి గతంలో స్థానికులే వెళ్లేవారు.. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. దాదాపుగా ఈ ఐదు రోజులలో దాదాపుగా రెండు లక్షల మంది సలేశ్వరం దేవాలయాన్ని దర్శించుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు ఎంతో నచ్చే ప్రదేశం కావడంతో సలేశ్వరానికి రావడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర వేసవి కాలంలో అడవిలో జరుగుతుండటంతో ఇక్కడకు వచ్చే భక్తులకు దాతలు ఉచిత భోజన వసతి, నీరు ప్రాధమిక ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.

సలేశ్వరానికి 28 కిమీల దూరంలో శ్రీశైలం ఉండటంతో ఇక్కడకు వచ్చిన భక్తులు శ్రీశైలం మల్లన్నను కూడా దర్శనం చేసుకొని తిరిగి వెళ్తారు.

జాతరకు 15 రోజుల ముందు నుంచి ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. జాతర సంవత్సరానికి ఐదు రోజులే జరగనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.