తమిళనాడు సార్వత్రిక ఎన్నికలకు ముందు తమిళనాడు చిన్నమ్మగా కొలుచుకునే శశికళ జైలు నుంచి విడుదల కానుండటంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. శశికళ రాకతో తమిళ రాజకీయాలలో పెను సంచలనాలు ఏమైనా ఉంటాయా అనే కోణంలో వివిధ వార్తాపత్రికలలో అనేక కథనాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఇక శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విడుదలవ్వాలంటే కోర్టుకి పది కోట్ల రూపాయలను చెల్లించవలసి ఉంది.

ఇప్పటికే అనేక ఐటి చిక్కులతో సతమతమవుతూ ఆమె ఆస్తులన్నీ జప్తు చేయబడితే ఇప్పుడు శశికళ పది కోట్ల రూపాయలను ఎక్కడ నుంచి తెస్తుందని, ఆమె అంత డబ్బుని ఎలా చూపిస్తుందన్న దానిపై ఐటి శాఖ ఫోకస్ పెట్టిందట. శశికళ దగ్గర పది కోట్లు ఏమి కర్మ పది వేల కోట్లకు పైగానే ఆస్తులు పోగేసుకుంది. కానీ అక్రమమే కదా, సక్రమమని కనీసం పది కోట్లు చూపించలేని పరిస్థితులలో ఉంది.

కానీ ఇప్పుడు ఐటి శాఖ శశికళ విడుదల సమయంలో చూపించే డబ్బుపై కన్నువేయడంతో ఆమె అభిమానులు నేరుగా విరాళాల రూపంలో ఆ మొత్తాన్ని సేకరించి శశికళ విడుదలకు మార్గం సుగమం చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. శశికళ ఎన్ని ఆటుపోట్లు చూసి శిఖరాన్ని చేరుకునే సమయంలో అదః పాతాళానికి చేరిపోయింది. మరోసారి తనకు రాజకీయంగా వచ్చే అవకాశాన్ని తాను ఏమాత్రం వదులుకోకుండా ఐటి శాఖకు దొరకకుండా తన అభిమానుల పేరుతో కొత్త నాటకానికి తెరతీసి పది కోట్ల రూపాయలు పోగుచేసినట్లు చూపించి ఎంచక్కా జైలు నుంచి బయటపడటానికి స్కెచ్ సిద్ధం చేసి పెట్టేసిందట. అసలు జైలు నుంచి ముందుగానే సత్ప్రవర్తనతో విడుదల చేస్తారని పుకార్లు వచ్చినా జైలులో తాను శిక్ష అనుభవించే సమయంలో దొంగచాటుగా బయటకు వచ్చి షాపింగ్స్ గట్రా చేసిందని ఆరోపణలు ఉండటంతో ఆమెను ముందుగా విడుదల చేసే అవకాశం లేనట్లు తెలుస్తుంది.