చంద్రబాబు నాయుడు ఎప్పుడు తాను చేసిందే రైట్ అనుకుంటుంటాడు. తనకు ఇష్టమైతే ఒకరిని తిడతాడు? తనకు కావాలనుకుంటే వారిని దగ్గరకు తీసుకొని ఓట్లు, సీట్ల కోసం ఉపయోగించుకుంటాడు? తనకు పొత్తు అడిగానంటే అదంతా వారి అదృష్టమని తాను ప్రవర్తించే తీరులో ఏదైనా ఉంటుందని చంద్రబాబు తెగ ఫీలైపోతుంటాడు. దానికి కారణం కూడా ఒకప్పుడు మోదీ హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేపిస్తానని మాట్లాడిన బాబు, దేశవ్యాప్తంగా మోదీకున్న హావ చూసి 2014 ఎన్నికలలో మోదీ పేరు చెప్పుకొని మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ హావ దేశవ్యాప్తంగా తగ్గుతుందని తనకు భజన చేసే కొన్ని పచ్చ పత్రికలు ఉప్పందించడంతో వారి మాట నమ్మి ప్రధాని మోదీని బండ బూతులు తిట్టి ఏకంగా హోమ్ మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడికి కూడా పురిగొల్పాడు.

కానీ దేశంలో రెండవసారి మోదీ అధికారంలోకి వచ్చి బీజేపీ పార్టీ వెలిగిపోవడంతో పాటు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు లేనట్లు అత్యంత దారుణమైన స్థితిలో 23 సీట్లకు పరిమితమవ్వడంతో ఇప్పుడు మరోసారి బీజేపీ పంచన చేరాలని బాబు తెగ ఉబలాటపడిపోతున్నాడు. దానికి సంబంధించి ఎప్పుడైతే తాను ఓడిపోయాడో ఆ వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి మోదీ తనపై క్షమాగుణం చూపిస్తే చూడాలని ఉందంటూ దీనంగా చూసాడు. దీనితో పాటు బీజేపీ పార్టీలోకి తనకు సంబంధించిన మనుషులను పంపించి గత ఏడాదిగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తన గుప్పెట్లో పెట్టుకొని తాను ఆడమన్నట్లు ఆడేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

కానీ బీజేపీ అధిష్టానం దీనిని ముందుగానే గమనించి కన్నా లక్ష్మీనారాయణను తప్పించి ఎప్పుడైతే సోము వీర్రాజుని తీసుకొచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టిందో అప్పటి నుంచి చంద్రబాబుకి కష్టాలు మొదలయ్యాయి. కానీ తనకు వీలు చిక్కినప్పుడల్లా తాను రాబోయే రోజులలో బీజేపీ పార్టీతో కలసి పనిచేయబోతున్నా అని పచ్చ మీడియా ద్వారా పుంఖాను పుంఖాలు వార్తలు వండి వార్పించుకునే పని చేస్తున్నాడు. దీనిపై ఈరోజు సోము వీర్రాజు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి తమ తాట తీసాడు? ఈరోజు ఓడిపోయాడు కాబట్టి తమ పార్టీకి టచ్ లోకి వస్తాడా? అంటూ సూటిగా ప్రశించారు.

చంద్రబాబు నాయుడు తమతో పొత్తు వద్దనుకుని ఇష్టానుసారంగా తిట్టినప్పుడు బుర్ర అతడికి చెడిందా? ఈరోజు అధికారంలో లేడు కాబట్టి బుర్ర బాగైందా అందుకే తమతో కలసి పని చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడా? చంద్రబాబు నాయుడు తనకు నచ్చిన వారి దగ్గర బీజేపీ తో తాను టచ్ లో ఉన్నా అని ఎన్ని సార్లైనా చెప్పుకోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దీన స్థితిలో తాము లేమని, ఆ పార్టీతో తమకు పొత్తు అవసరం లేదని, తాము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో మాత్రమే పొత్తులో ఉన్నామని, మరొక పార్టీతో తమకు పొత్తు లేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎంతలా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నా సోము వీర్రాజు మాత్రం ఎప్పటికప్పుడు అతడికి కౌంటర్లు ఇస్తూ కొరకరాని కొయ్యగా తయారయ్యారు.