కూకట్ పల్లి నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2009, 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీనే ఇక్కడ గెలిచింది. 2009 ఎన్నికలలో లోక్ సత్త అధినేత తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా నిలబడి గెలుపొందారు. ఇక 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి మాధవరం కృష్ణారావు దాదాపుగా 40 వేల ఓట్ల బారి మెజారిటీతో విజయం సాధించాడు. ఇప్పుడు అదే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి టీడీపీ పార్టీకి గట్టి పోటీనిచ్చాడు.

చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ఎన్నికలలో గెలుపు అంత సులభం కాదని గ్రహించి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాషిణిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ఈ నియోజకవర్గ ఎన్నికను ఆసక్తిగా మార్చారు. కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాషిని గెలుపుపై చంద్రబాబు నాయుడు అన్ని తానై చూసుకొని కృషి చేయగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు తరుపున ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు.

గత రెండు ఎన్నికలలో సెటిలర్స్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన వారు ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీపై మొగ్గు చూపడంతో సుహాషిని గెలుపు కొంత కష్టతరంగా మారింది. కానీ చివరి మూడు రోజులు కూకట్ పల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, నందమూరి బాలకృష్ణ ముమ్మర ప్రచారం చేసారు. వీరి ప్రచారంతో కూకట్ పల్లిలో గెలవడం ఖాయమనుకొని తెలుగుదేశం నేతలు సుహాషిని గెలుపుపై కోట్లలో పందేలు కాసినట్లు తెలుస్తుంది. ఎన్నిక మొదలైన మొదటి రెండు గంటల వరకు ఏకంగా 10 వేల పైన మెజారిటీతో సుహాషిని గెలుపొందుతుందని పందేలు కాసిన వారు సాయంత్రానికి గెలుపుపై ధీమా సన్నగిల్లి కనీసం గెలుస్తుందని పందేలు కాయడానికి కూడా వెనకాడారు.

ద్వితీయశ్రేణి నాయకుల దెబ్బ

ఎన్నికల ముందు రోజు సుహాషిని గెలుపు కోసం కావలసినంత డబ్బు పంపిణి చేసి పంచమని తెలుగుదేశం ద్వితీయశ్రేణి నాయకులకు ఇస్తే వారు డబ్బు పంచకుండా మొత్తం మింగేశారని, బస్తి నాయకులతో పాటు, ఆంధ్ర నుంచి సుహాషిని కోసం పని చేయడానికి వచ్చిన వారు డబ్బుకి కక్కుర్తి పడి చివర్లో డబ్బుని పంచకుండా వారి జేబుళ్లతో నింపుకోవడంతో పాటు, డబ్బు పంచడానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారిని టీఆర్ఎస్ శ్రేణులు గుర్తించి ఎక్కడికక్కడ పోలీసులకు పట్టించడంతో మిగతా వారు కూడా పలాయనం చిత్తగించారు. బస్తి వాసుల ఓట్లు కూడా మొత్తం గంపగుత్తుగా టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లాయని తెలుస్తుంది.

ఇక కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే సామజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే పోలింగ్ బూత్ లలో పోలింగ్ 40 శాతం మించకపోవడంతో నందమూరి సుహాషిని గెలుపుపై టీడీపీ శ్రేణులకు బెంగ పట్టుకుంది. నందమూరి సుహాషినికి 10 వేల మెజారిటీ వస్తుందని ఎన్నికల ముందు వరకు టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తే, ఎన్నికల తరువాత టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 10 వేల మెజారిటీతో గెలవబోతున్నాడని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత టెన్షన్ నెలకొన్న కూకట్ పల్లి నియోకవర్గ బాద్ షా ఎవరో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
  •  
  •  
  •  
  •  
  •  
  •