చంద్రబాబు నాయుడుకి నమ్మకస్తుడైన బినామీగా సుజనా చౌదరిని ఇన్ని రోజులు వైసీపీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా నమ్మేవారు. కానీ అలాంటి సుజనా చౌదరే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి హ్యాండ్ ఇచ్చి బీజేపీ పంచన చేరడంతో తెలుగు తమ్ముళ్లు తట్టుకోలేక పోతున్నారు. సుజనా చౌదరి ఇంత నమ్మక ద్రోహం చేస్తాడనుకోలేదని, పార్టీకి ఒక్క ఓటు కూడా తీసుకురాని ఇలాంటి వాళ్ళను పెంచి పోషిస్తే చంద్రబాబు నాయుడుకే వెన్నుపోటు పొడిచారని సోషల్ మీడియా వేదికగా సుజనా చౌదరి మీద నిప్పులు కక్కుతున్నారు.

మరోవైపు సుజనా చౌదరి పార్టీ మారడానికి ప్రధాన కారణం నారా లోకేష్ చేస్తున్న పనులే అని, పార్టీని నాశనం చేస్తున్నాడని చంద్రబాబుకి ఎంత చెప్పినా వినకపోవడంతోనే సుజనా చౌదరి పార్టీ మారాడని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సుజనా చౌదరి ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు నారా లోకేష్ పై ఎటువంటి కోపం లేదని, తాను పార్టీ మారడానికి నారా లోకేష్ కు ఎటువంటి సంబంధం లేదని తెలియ చేసారు. కానీ చంద్రబాబు నాయుడుతో ఒక్క విషయంలో మాత్రం విబేధించానని… బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు రావద్దని, బీజేపీతోనే ఉండి రాష్ట్రానికి కావలసిన నిధులపై గట్టిగా పోరాడదామని ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు నా మాట వినలేదని చెప్పుకొచ్చారు.

పార్టీలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకి నివేదిక అందచేసేవాడిని, లోకేష్ విషయంలో మాత్రం చంద్రబాబుకి వెంటనే ఫోన్ లో స్పందించరని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరని మాత్రం పిర్యాదు చేశానని అయినా పరిస్థితులలో ఎలాంటి మార్పు రాకపోవడంతో 2017 నుంచి అది కూడా చెప్పడం మానేసానని, అంతకు మించి లోకేష్ నే ప్రధాన కారణంగా తాను పార్టీ మారాను అనడంలో అర్ధం లేదని సుజనా చౌదరి తెలియచేసాడు.
  •  
  •  
  •  
  •  
  •  
  •