ఆంధ్రప్రదేశ్ లో గత చంద్రబాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను దాదాపుగా 23 మందిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న వారికి గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు 23 సీట్లు మాత్రమే ఇచ్చి చావు దెబ్బ తీశారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం తీసిపోకుండా గతంలో వారు చేసిన పని ఈరోజు వీరు కూడా చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం కాస్త తెలివిగా వ్యవహరిస్తూ వారిని ఏ మాత్రం నేరుగా పార్టీలో చేర్చుకుందా సీఎం జగన్ తో చర్చల పేరుతో అలా అప్పుడప్పుడు కలుస్తూ తాము వైసీపీ సానుభూతిపరులమే అని చెప్పకనే చెబుతున్నారు.

ఇప్పటికే వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కారణం బలరాం ఇలా సీఎం జగన్ ను కలసి రాబోయే రోజులలో తమ రాజకీయ జీవితం వైసీపీ పార్టీతో ముడిపడి ఉందని చెప్పినట్లే ఈరోజు విశాఖ సౌత్ నియోజకవర్గానికి చెందిన టీడీపీకి చెందిన వాసుపల్లి గణేష్ అనే ఎమ్మెల్యే జగన్ ను కలవనున్నారు. ఇన్ని రోజులు వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగా వస్తున్నారు. విశాఖలో రాజధాని ప్రకటించిన తరువాత కూడా వాసుపల్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు నేరుగా సీఎం కలవడంతో ఇక వాసుపల్లి కూడా లాంఛనమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాసుపల్లి గణేష్ కూడా సీఎం ను కలిస్తే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైసీపీ పంచన చేరారని అనుకోవచ్చు. మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్న తమకు కావాల్సిన వారిని, అవసరాలకు తగ్గట్లు మాత్రమే వైసీపీ పార్టీ ముందుకు వెళుతుంది.