తెలంగాణలో డిసెంబర్ 7 న శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 11వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. అయితే, తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు.

నవంబర్‌ 12న షెడ్యూల్‌ విడుదల చేస్తామని, డిసెంబర్‌ 7న ఒకే విడతలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.కాగా సుప్రింకోర్టు తీర్పు ప్రకారం శాసనసభ రద్దు అయిన ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరపవలసి ఉంటుందని ఆయన అన్నారు.