తెలంగాణాలో ఒకవైపున ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని లొల్లి చేస్తుంటే తెలంగాణ సర్కార్ ఏ మాత్రం ఖాతరు చేయకుండా అసలు మీతో చర్చలే లేవు అని తెగేసి చెబుతూ వారిపై ఆగ్రహంగా ఉంటే, మరోవైపున దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పి దాదాపుగా 49 వేల కార్మికుల ఇళ్లలో వెలుగులు నింపింది. ఈనెల 25వ తేదీన దాదాపుగా 64,700 రూపాయల బోనస్ ఇవ్వనుంది. ఇదే బోనస్ గతేడాది 60,500 ఇచ్చారు.

కానీ ఈ ఏడాది దానికి మరికొంత అదనంగా ఇవ్వనుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ తీపి కబురుతో సింగరేణి కార్మికులు పండుగ చేసుకుంటుంటే ఆర్టీసీ కార్మికులకు సమ్మె నేపథ్యంలో గత నెల జీతాలు కూడా ఇంకా అందక అవస్థలు పడుతున్నారు. కేసీఆర్ సర్కార్ మాత్రం ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ యూనియన్లు గట్రా లాంటి లొల్లి లేకుండా మొత్తం ఆర్టీసీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.