మన దేశంలో ప్రతి రాష్ట్రంలో మద్యం అనేది మంచి ఆదాయ వనరుగా మారిపోయింది. పేదలకు పట్టెడన్నం పెడుతున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు అదే పేదవాడి నోటికాడ కూడు లాగేసేలా మద్యం షాపులను పెంచి పోషించడం, వారికిష్టమైన రీతిలో ధరలు పెంచడం దండిగా ఖజానా నింపుకోవడం పరిపాటిగా మారింది. మద్యం తాగేవాడు ముందు వెనుక ఆలోచించకుండా పెళ్ళాం పుస్తెల తాడు తాకట్టైనా పెట్టి మద్యం తాగడానికే ఆసక్తి చూపిస్తున్నాడు.

అలాంటిది గత 45 రోజులుగా మద్యం దొరక్క పోవడంతో ఈరోజు నుంచి అనేక రాష్ట్రాలలో మందు షాపులు తెరుచుకోవడంతో పాటు అసలు మన దేశంలో పేదరికం ఉందా? నిజంగా పేదవాడు పట్టెడన్నం కోసం గత 45 రోజులుగా అర్రులు చాస్తున్నాడా అనేలా మద్యం దుకాణాల ముందు ఎంత పెట్టైనా మద్యం కొనుగోలు చేయడానికి ముందు వరుసలో కార్మికులు, కూలీలే ఉండటం ఆశ్చర్యం కలగక మానదు. ఇన్ని రోజులుగా ప్రభుత్వాలు, సామజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు పనులు లేక అవస్థలు పడుతున్న వారికి నిత్యావసరాలు పంపిణి చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే ఈరోజు ఉప్పెనలా మద్యం కొనుగోలుకు వచ్చిన వారిని చూసి అందరూ నోరెళ్ళ బెట్టి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది.

మందు కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని మాకు కావాల్సింది మద్యం మాత్రమే అనేలా నెట్టుకొవడాలు.. కొట్టుకోవడాలు చూస్తుంటే ఏపీలో ఈరోజు మద్యం షాపుల ముందు పరిస్థితి కంట్రోల్ తప్పినట్లు కనపడుతుంది. దీనితో తెలంగాణ సర్కార్ మే 7 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఆ తరువాత మద్యం షాపులు తెరుచుకుంటాయని… మరికొంత మంది మే 21 వరకు తెలంగాణలో ,లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పుకొస్తున్నా… అసలు ముందు ఎలాంటి సడలింపులు ఇచ్చినా మద్యానికి మాత్రం సడలింపు ఇచ్చే పరిస్థితి ఉండదని తెలుస్తుంది.

ఒకవేళ మద్యానికి సడలింపులనిచ్చి మందు షాపులు తెరుచుకుంటే తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారేలా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణలో మామూలుగానే మద్యం ప్రియులు ఎక్కువ. తెలంగాణ సర్కార్ కూడా అందుకు తగట్లు మద్యం దుకాణాలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రతిఒక్కర దగ్గరకు మద్యం తీసుకొని వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణలో ఉన్న మద్యం షాపులే నిదర్శనం. ఇక కేసీఆర్ ఏపీ దెబ్బతో కాస్త తేరుకొని ఆర్ధికంగా తేరుకోవడానికి మద్యం షాపులు తెరవాలని భావించినా ఇప్పుడు అందుకు ఒప్పుకునే పరిస్థితులు లేవు. రాబోయే రోజులలో తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ నిబంధనలు సడలించినా మద్యం దుకాణాలైతే తెరిపించే అవకాశాలు కనపడటం లేదు. తెరిస్తే ఇంకా తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకోవడమే.

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది

మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!