తాము గులాబీ ఓనర్లమని గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు లొల్లి చేస్తున్న సంగతి తెలిసిందే. అది సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా సరే ఒకటే పంథా… ఒకటే ద్యేయం తమకు మంత్రి వర్గంలో చోటు కావాలి. తాము గులాబీ పార్టీ పెట్టిన మొదటి నుంచి పార్టీకి అంటిపెట్టుకొని ఉన్నాం. మధ్యలో వచ్చిన కిరాయిదార్లకు ఎలా ఇస్తారని ఒకటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఇప్పుడు ఓనర్లతో పాటు, మధ్యలో వచ్చిన కిరాయి ముఠా కూడా లొల్లి షురు చేస్తుందట. అరే బాయ్ మొదటి నుంచి ఉన్నవాడికి దిక్కులేదు మీ లొల్లేమిటిరా సామి అంటూ తలపట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందుగా ఈ లొల్లంత హరీష్ రావు దగ్గర నుంచి మొదలైంది. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఎప్పుడు బయటకు సీఎం కేసీఆర్ పై అసంతృప్తి చూపించలేదు. పార్టీ విధేయుడిగానే ఉంటూ పార్టీ నిర్మాణంలో ఎప్పటికప్పుడు తన వంతు కృషి చేస్తుంటాడు.

కానీ హరీష్ రావుకు మంత్రి పదవి దక్కలేదని ఎక్కడో తెలియని బాధ ఉందట. ఆ బాధను ఎప్పటికప్పుడు హరీష్ రావు అనుచరులు సోషల్ మీడియా సాక్షిగా వ్యక్తం చేస్తుంటారు. ఇక కొత్తగా ఈటెల రాజేంద్ర, రసమయి బాలకిషన్, నాయిని నరసింహ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ రాజయ్య, పద్మా దేవేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అబ్బో లిస్ట్ చాంతాడంత పెరుగుతుండటంతో ఎందుకొచ్చిందిలే ఈ లొల్లిని ఇంతటి ఆపేయాలనుకున్నారో ఏమో సీఎం కేసీఆర్.. హరీష్ రావును మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.

ఇక హరీష్ కు మంత్రి పదవి వచ్చింది… ఇక హరీష్ వర్గమంతా సైలెంట్… బీజేపీ హరీష్ ను ఉపయోగించుకొని వేయాలన్న ఎత్తులన్నీ చిత్తయిపోయాయి. హరీష్ కు కీలకమైన ఆర్ధిక శాఖ ఇవ్వడంతో ఒక్క దెబ్బకు వంద పిట్టలనట్లు ఫసక్ చేసేశారు. ఈ పరిణామాలతో మంత్రి పదవులు రాని వారు ఏమాత్రం తగ్గకుండా నాలుగురోజుల క్రితం మల్కాజ్ గిరిలో భేటీ అయ్యారట.

వారికి ఉన్న ఒకే ఒక్క దైర్యం… ఏమవుతుందట… బీజేపీ ఉండనే ఉంది… అనే ఒకే ఒక్క దైర్యం అన్నట్లు తెలుస్తుంది. మరోవైపున బీజేపీ కూడా ఎవరని వదలకుండా వెనక నుంచి మంతనాలు చేస్తూనే ఉంది. అసలే ఇప్పుడు కొత్తగా తమిళ సై ను తీసుకువచ్చి తెలంగాణ గవర్నర్ గా చేసారు. ఆమె ఎవరి మాట వినే రకం కాదు, అసలు ఆమెకు వివాదాలంటే బహు మక్కువ. ఎన్ని వివాదాలు ఏర్పడిన వెనక్కు తగ్గకుండా తమిళనాడులో బీజేపీ పార్టీ కోసం కృషి చేస్తూనే ఉన్నారు.

ఇన్ని పరిణామాలు జరుగుతున్నా కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడం అంత సాధ్యం కాదు… రాదన్న తెలంగాణే కేసీఆర్ తెచ్చాడు. ఈ గొడవలన్నీ ఎంత… అంతా పాలపొంగు లాంటివే… కాసేపు పత్రికలు పిచ్చ్పాటిగా వార్తలు రాసుకోవడానికి తప్ప కేసీఆర్ ముందు తల ఎత్తే సాహసం చేయరన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చూద్దాం ముందు ముందు రోజులలో రాజకీయం ఎలా మారుతుందో.

  •  
  •  
  •  
  •  
  •  
  •