ఎంతవరకు నిజమో తెలియదు గాని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద షాక్ తగలనునట్లు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నాయకులు బీజేపీలోకి వెళ్ళబోతున్నారన్న వార్తలు కాస్త ఆసక్తిగా మారాయి. సెప్టెంబర్ 17వ తేదీన అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఆరోజు ఈ ముగ్గురు నాయకులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని తెలుస్తుంది. అందులో ఇద్దరు మైనంపల్లి హనుమత రావు, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేలు కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మరొకరిని చెబుతునాన్రు.

ఇప్పటికే ఈ ముగ్గురు మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో చర్చలు చేశారని బీజేపీతో కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు వస్తున్న వార్తలు కాస్త సంచలనం కలిగించేవే. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీతో సహా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేరుతుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతారా అసలు అధికార పార్టీని వదిలి వెళ్లే దమ్ము ఉందా అన్న వ్యాఖ్యానాలు కూడా వినపడుతున్నాయి.

కానీ మంత్రి వర్గ విస్తరణతో పాటు, మరికొన్ని లుకలుకలు కూడా దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కొల్లాపూర్ నుంచి గత ఎన్నికలలో జూపల్లి కృష్ణరావు కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత బీరం వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గం హావ మొత్తం బీరం హర్షవర్ధన్ రెడ్డి కనుసన్నలలోనే నడుస్తుందట. జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి కూడా కావడం తనను లెక్కచేయకపోవడంతో కొన్ని రోజులుగా అలకపాన్పు ఎక్కారట.

ఇక నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పార్టీ మారడానికి గత ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ కూతురు కవిత బీజేపీ ఎంపీ డి అరవింద్ చేతిలో ఓడిపోవడం, మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలవడంతో టీఆర్ఎస్ పార్టీ వారిద్దరిని పక్కన పెట్టిందట. దీంతో వారు కూడా హర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు గాని, ఈ ముగ్గురు పార్టీ మారతారని సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

తమిళనాడు బీజేపీ లీడర్ తమిళ సై సౌందరరాజన్ గవర్నర్ గా తెలంగాణకు నియమించబడటం, ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని వార్తలు రావడం కాస్త కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేపట్టాలని పట్టుదలతో ఉండటంతో ఎమ్మెల్యేలను కూడా ఆకట్టుకోవాలని చూస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •