హుజుర్ నగర్ ఉపఎన్నికలు మరొక పది రోజులలో జరగనున్నాయి. ఒకవైపున అన్ని పార్టీలు హుజుర్ నగర్ ఉపఎన్నికపై దృష్టి పెడుతూనే టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్నర్ చేసి కాంగ్రెస్ పార్టీ గట్టెక్కాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలు ప్రతి ఊరిలో ఆర్టీసీ కార్మికులతో కలసి ధర్నాలతో పాల్గొంటూ టీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ ను దుయ్యబడుతున్నారు. ఇదే సందర్భంగా హుజుర్ నగర్ ఉపఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వడానికి ముందుకొచ్చిన సీపీఐ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా ఈరోజు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం కనుక ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే హుజుర్ నగర్ ఉపఎన్నికపై మరోసారి అలోచించి ఉపసంహరించుకుంటామని, ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.

కానీ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులపై ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనపడటం లేదు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రజలందరిని ఇబ్బంది పెడుతూ ఆర్టీసీ కార్మికులు తీసుకున్న చర్య పట్ల కేసీఆర్ చాల సీరియస్ గా ఉన్నారు.ఈసారి ఆటో ఇటో తాడో పేడో తేల్చుకోవాలని, భవిష్యత్తులో తాము కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆపార్టీకి ఇలా సమ్మెల పేరుతో ఇబ్బందులు ఎదురు కాకూడదని అంటున్నారు.