ఈ ప్రపంచంలో ప్రతి పనిలో దానికి సంబంధించిన మాఫియా వెనకుండి అన్ని పనులను చక్కపెడుతుంటుంది. అందులో భాగంగా ప్రపంచాన్ని ఏలేస్తున్న సోషల్ మీడియా మాఫియా గురించైతే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరిని పైకి లేపాలన్నా, మరొకరిని కింద పడేయాలన్నా సోషల్ మీడియాదే అగ్రస్థానం. దీని కోసం రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రేటిస్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చుపెడుతుంటారు. అందులో భాగంగా ఏదైనా రాజకీయ నాయకుడు లేదా సినీ స్టార్ పుట్టినరోజు లేదా, సినిమా విడుదలయ్యే సమయంలో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ తో మోత మోగిస్తుంటారు.

ఈమధ్య ఏకంగా ట్విట్టర్ ట్రేండింగ్ గురించైతే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. మా హీరోకు ఇన్ని లైక్ లు వచ్చాయని, ట్వీట్లు, రీ ట్వీట్లు, హ్యాష్ ట్యాగ్ ఇండియా ట్రేండింగ్ గా మారిందని. మాకు వరల్డ్ ట్రేండింగ్ చేయగలిగిన సత్తా ఉందని ఇలా అనేక గొప్పలు చెప్పుకుంటారు. అసలు నిజాయితీగా మాట్లాడుకుంటే మన సౌత్ ఇండియాలో బేసిక్ గా ట్విట్టర్ ఉపయోగించేవారు చాలా తక్కువ. పేస్ బుక్ లాగా ట్విట్టర్ ను చాలా మంది ఇష్టపడరు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి అలానే ఉంది.

మనం ఏదైనా ట్వీట్ ను ట్రెండ్ చేయాలంటే ముందుగా ఒక హ్యాష్ ట్యాగ్ అనుకోని డిసైడ్ చేసుకోవాలి. తరువాత మన హ్యాష్ ట్యాగ్ ను ట్రేండింగ్ చేయడానికి మన దేశంలో బోలెడు మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయి. మనకు ఎన్ని ట్వీట్లు, రీ ట్వీట్లు కావాలో దానిని బట్టి రేటు నిర్ణయిస్తారు. వాటిని బౌట్స్ అని పిలుస్తుంటారు. వాళ్ళు వాళ్లకున్న టెక్నాలజీని ఉపయోగించి ఒక లూప్ ప్రోగ్రాం ఒకటి రాసి అనేక ఫేక్ అకౌంట్లతో ట్రేండింగ్ చేస్తుంటారు. దీనిని సహజంగా కమర్షియల్ అడ్వేర్టైజ్మెంట్ కోసం వాడతారు. దానికి కావాల్సింది కేవలం డబ్బు. డబ్బు ఉంటే సుబ్బిగాడు కూడా సుబ్బరాజుగా కొలవబడతాడనట్లు డబ్బుతో మొత్తం చరిత్రలనే మార్చేసి ఇప్పుడు ప్రతి హీరో తమ అభిమానులను సంతృప్తి పర్చడం కోసం వాడక తప్పడం లేదు.

ఒక్కసారి ట్విట్టర్ లో సెలెబ్రేటిస్ ఫాలోయర్స్ ను కూడా మీరు ఓపికగా గమనిస్తే మిలియన్ల ఫాలోయర్స్ ఉంటారు. మన తెలుగు హీరోలు, కొంతమంది రాజకీయ నాయకులకు కూడా మిలియన్ల ఫాలోయర్స్ ఉంటారు. కానీ వారి ఫాలోయర్స్ లిస్ట్ ఓపెన్ చేసి ఓపికగా చూస్తే పాకిస్థాన్, దుబాయ్ చైనా అనేక దేశాలకు చెందిన వారు కూడా ఫాలో అవుతుంటారు. వారంతా మన తెలుగు హీరోలు, రాజకీయ నాయకులకు అభిమానులంటారా? ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చిన్న ఉదాహరణగా ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు.

మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ అకౌంట్ కు దాదాపుగా 4.3 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు అంటే 43 లక్షల మంది ఫాలో అవుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ కనుక పెడితే కేవలం 100 నుంచి వెయ్యి లైక్స్ మాత్రమే ఉంటాయి. చంద్రబాబు నాయుడుని 43 లక్షల మంది ఫాలో అవుతుంటే కనీసం ఒక్కశాతం మంది లైక్స్ చేసినా 43 వేల లైక్స్ రావాలి, కానీ కేవలం ఆ ఒక్కశాతం 43 వేల మందిలో మరోక ఒక్క శాతం కూడా లైక్ చేయడం లేదంటే, తమ అభిమానులను, తమ డాపు దర్పం చూపించుకోవడానికి ఎంత ప్రయాసపడతారో గమనించవచ్చు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడుకే సంబంధించినది కాదు.. చాలా మంది రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రేటిస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారు.