కొంతమంది నాయకులకు విలువలతో పని లేదు, వారి ఎజండా ఒక్కటే హ్యాపీగా అధికార పక్షం నీడలో కునుకు తీయాలన్న ఆశ, ఆ చిన్న ఆశ వారిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. బండ బూతులు తిట్టిన నాయకుడిని గట్టిగా కౌగిలించేసుకొని ఐ లవ్ యు చెప్పేసి నువ్వు పెద్ద తురుము ఖాన్ అని పొగిడేస్తారు. ఇప్పుడు ఆ కోవలోకే విజయవాడ టైగర్, బెబ్బులి అని ముద్దుగా పిలుచుకునే తెలుగుదేశం యువతకు ఝలక్ ఇస్తూ వైసీపీలోకి రావడానికి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెడీ అయిపోతున్నాడు.

అయ్యో ఇదేమిటి మా అన్న బెబ్బులు అనుకున్నాం ఇప్పుడు ఏమిటి ఇలా సరెండర్ అయిపోతున్నాడు అనుకుంటే, అదేమి లేదు గత ఎన్నికలలో అక్రమంగా ఇళ్ల పట్టాల కేసు ఒకటి వంశీ తలకు చుట్టుకుంది. దానితో పాటు తెలుగుదేశం పార్టీ ఇక మునిగిపోయే నావ అని అందరూ భావిస్తున్న వేళ ఇప్పుడే వైసీపీలోకి చేరిపోతే, ఎంచక్కా జగన్ విలువలను మెచ్చి రాజీనామా చేస్తే అధికారం పక్షం తరుపున పోటీ చేయడం కదా ఎలాగైనా గెలిచేయవచ్చని బావిస్తుండవచ్చు. అసలే తన ఆప్త మిత్రుడు కోడలి నాని వైసీపీలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇంకేం కావాలి కావాల్సినంత పరపతి గత ఐదేళ్లలో ఎలా అధికారాన్ని అనుభవించామో అలానే మరొక ఐదేళ్లు తెలుగుదేశం నుంచి జంప్ చేసి ఇప్పుడు వైసీపీ పంచన చేరి అహీకార పార్టీలో ఖుషి ఖుషి చేసేద్దామని బావిస్తుండవచ్చు.

కానీ జనం ఏమైనా పిచ్చోళ్లా.. ఇష్టమొచ్చిన పార్టీలోకి తాను జంప్ చేస్తాను తనను గెలిపించండి అంటే గెలిపిస్తారా, రోజులు మారాయి బాసు…. జనం కూడా తెలివి మీరారు. ప్రజలు కూడా ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించాలన్న వారిని ఓటు అనే ఆయుధంతో వారికి పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మొన్న జరిగిన హుజుర్ నగర్ కావచ్చు, మహారాష్ట్రలో ఎన్సీపీ నుంచి జంప్ చేసి బీజేపీలో చేరి ఎన్నికలు ఎదుర్కొని కంగుతిన్న ఉదయన్ రాజే భోసలే కావచ్చు ఇంకా మరికొందము కావచ్చు ఎవరైనా జంప్ చేసారంటే వారిని ఓడగొట్టటమే పనిగా పెట్టుకున్నారు. హుజుర్ నగర్ ఎన్నికలలో ఎంచక్కా గెలిచి అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేయకుండా పార్లమెంట్ కు వెళ్లి అక్కడ గెలిచి ఉప ఎన్నికలలో తన భార్య పద్మావతిరెడ్డిని గెలిపించుకోవాలని అవసరం లేని ఎన్నికలు మీదేసుకొని తన కంటిని తానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొడుచుకున్నాడు. ఇంకోసారి హుజుర్ నగర్ పేరెత్తకుండా దాదాపుగా 43 వేలకు పైగా మెజారిటీతో గెలిపించి ఉప ఎన్నికలు అని మాట్లాడేవారి చెంప చెళ్లుమనిపించారు.

గత ఎన్నికలలో వైసీపీ నుంచి పిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలలో 22 మంది సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయారంటే ప్రజలు పార్టీలు మారే వారి పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో చెప్పకనే చెబుతుంది. కాదు తాము తోపులం మా ఏరియాలో అనుకుంటే ఉదాహరణకు కడప జిల్లా జమ్మలమడుగులో కొన్ని దశాబ్దాలుగా కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టులుగా ముద్రవేసుకొని ఎదురుపడితే కత్తులతో నరుక్కోవడమే అనుకునే అది నారాయణరెడ్డి, రామ సుబ్బారెడ్డి కుటుంబాలు డబ్బు కోసం, పరపతి కోసం ఇద్దరు ఒక్కటైతే ఇక మాకు నియోజకవర్గంలో తిరుగులేదనుకుంటే, వారిని ప్రజలు ఇంకోసారి జమ్మలమడుగు పరిసర ప్రాంతాలలో కనపడకుండా వోట్ ఆయుధంతో తన్ని తరిమేశారు.

రేపు వంశీ పరిస్థితి కూడా ఇందుకు బిన్నంగా ఏమి ఉండదు. ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు, నాయకుల వెనక నిలబడి ఎప్పుడు జేజేలు కొట్టడమే వారి పని కాదు, ఒక్కసారి నమ్మి ఓటు వేస్తే ఆ పార్టీ తరుపున ప్రణాలిచ్చి అయినా పోరాడాలి, కానీ రాజకీయ భవిష్యత్ కోసం, కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం, కేసుల మాఫీ కోసం ఇలా పార్టీలు మారతామంటే చూస్తూ ఊరుకునే రోజులైతే ఏ మాత్రం లేవు. అసలు ముందు వంశీ పార్టీ మరాలిగా ఈ సోది అంత ఎందుకు అంటారా? ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో కుంపటి మొదలయింది వైసీపీ ఇంచార్జ్ యడ్లపాటి వెంకట్రావు ఎగిరెగిరి పడుతున్నాడంటేనే వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీ ఖాయమైనట్లు లెక్క.