మామ అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య కలసి మొదటి సారిఫుల్ లెంగ్త్ సినిమా చేస్తున్న “వెంకీ మామ”కు సంబంధించి గత వారం టీజర్ విడుదలై పసందైన విందునిచ్చింది. వెంకటేష్ అంటేనే మంచి కామెడీ టైమింగ్ కావడంతో సినిమాపై టీజర్ తరువాత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను మొదటిగా డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతి రేసులోకి దిగాలని భావిస్తున్నట్లు ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

బాలకృష్ణ హీరోగా వస్తున్న తన 105వ చిత్రం ముందుగా సంక్రాంతి రేసులో దిగాలని అనుకున్నా ఇప్పుడు నెల రోజులు ముందుగా డిసెంబర్ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాత సి కళ్యాణ్ భావిస్తున్నారు. దీనితో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పుకుంది అనుకుంటున్న సమయంలో వెంకటేష్ ఆ ప్లేస్ ను భర్తీ చేయాలని చూడటంతో మరింత టఫ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ లాంటి హీరోకు సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్, కుటుంబసమేతంగా హ్యాపీగా వెళ్లి ఆనందించే సినిమా కావడంతో సురేష్ బాబు సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట.

సంక్రాంతికి ఇప్పటికే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ”, అల్లు అర్జున్ “అల వైకుంఠపురం” రెండు సినిమాలతో పాటు రజనీకాంత్ “దర్బార్” సినిమాలు విడుదల చేయాలని కర్చీఫ్ వేసుకొని కూర్చుంటే వెంకటేష్ వచ్చి ఆంధ్రాకి షాక్ ఇస్తున్నాడు. ఇంత పోటీలో థియేటర్ దక్కుతాయా అంటే దానికి ఎలాంటి లోటు లేదు. సురేష్ బాబుకి రెండు రాష్ట్రాలలో దండిగా థియేటర్స్ అందుబాటులో ఉండటంతో పాటు సినిమా చాల బాగా రావడంతో మరింత కలెక్షన్స్ సాధించాలంటే సంక్రాంతి పండగ ఒక్కటే సరైన సీజన్ అని భావించి దిగుతున్నారు.

ఇంత ఉక్కపోత మధ్య సంక్రాంతి పందెం కోడిగా నిలబడి కలబడేదెవరో ఆసక్తిగా మారింది. ఇక నిర్మాతలందరూ కూర్చుని సంక్రాంతికి థియేటర్స్ ఇబ్బందులు రాకుండా “వెంకీ మామ” సినిమాను ముందుగా విడుదల చేసేలా ఏమైనా ఒప్పిస్తారేమో చూడాలి. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానేర్ పై సురేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.