బాలీవుడ్ లో ఒక సినిమా విడుదలైందంటే ఆ సినిమాకు సంబంధించి సవాలక్ష పనులన్నింటిని హీరో దగ్గరుండి చూసుకుంటాడు. ఇక ప్రమోషన్స్ మొదలుకొని, సినిమా  విడుదలై కలెక్షన్స్ క్లోజింగ్ వరకు మొత్తం దగ్గరుండి చూసుకుంటారు. ఇంకా అవసరమైతే గల్లిలలో తిరుగుతూ రకరకాల ఫీట్లు చేస్తూ ప్రేక్షకులను తమ సినిమాపై మక్కువ కలిగేలా చేయడంలో ఒకరికొకరు పోటీ పడి తమ సినిమాను హిట్ చేసుకోవడానికి నిర్మాతతో పాటు, దర్శకుడికి సహాయం చేస్తారు. 

మన తెలుగు హీరోలు అలా కాదు ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే ముందుగా నిర్వహించే ఆడియో వేడుకతో పాటు, సినిమా రిలీజ్ తరువాత హిట్ అయితే 50 రోజుల ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ లకు మాత్రమే వచ్చేవారు. ఇక ఇప్పుడు 50 రోజులు, వంద రోజులు ఫంక్షన్స్ లేకపోవడంతో వచ్చామా సినిమాలో నటించామా… పైసలు తీసుకున్నామా అన్న రీతిలోకి మారిపోయారు. కొంత మందిని అయితే పాపం నిర్మాత బతిమిలాడుకోవలసిన పరిస్థితి, మరికొన్ని సార్లయితే ప్రమోషన్స్ కోసం బయటకు రావడానికి సెపరేట్ పేమెంట్ ఇలా నిర్మాతలను విసిగించే హీరోలు, హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో కోకొల్లలు.

కానీ విజయ దేవరకొండ మాత్రం తన స్టైల్ వేరని చెబుతున్నాడు. మొదటి నుంచి తాను నటించిన సినిమాలకు ప్రమోషన్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ తన సినిమాను యువతలో లైమ్ లైట్ లో ఉంచేలా ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే “డియర్ కామ్రేడ్” సినిమాకు సంబంధించి దాదాపుగా నాలుగు రాష్ట్రాలలో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్ లో పాల్గొని సినిమాకు మంచి ప్రమోషన్స్ కల్పించాడు. గత వారం హైదరాబాద్ లో జరిగిన ఫంక్షన్ కైతే విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న స్టేజిపైకి వచ్చి డాన్స్ వేయడమే కాకుండా మధ్య మధ్యలో డ్రెస్సులు మార్చుకొని మరీ డాన్స్ లతో సినిమాను ఎంత ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు. 

విజయ్ దేవరకొండలా హీరోలు మొత్తం సినిమా నాదే అని బాధ్యత వహించి తమ భుజాన వేసుకోవడంతో ప్లాప్ అవుతుందనుకున్న సినిమాలకు కూడా మరికొంత కలెక్షన్స్ పెరిగి, నిర్మాతను కొంతలో కొంత సేఫ్ చేయవచ్చు. కానీ మన హీరోలు ఇలాంటి డాన్స్ లు గట్రాలకు ఎప్పుడు వ్యతిరేకం. అలా ఫంక్షన్ కు వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడి మమా అనిపించి మరో సినిమాపై దృష్టి పెట్టేస్తారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇలా తన సినిమా మొత్తం తన భుజాన వేసుకొని చేస్తుంటే నిర్మాతలు కూడా మరికొంత ఎక్కువ రెమ్యూనరేషన్ ముట్టచెప్పి తనతో సినిమాలు తీయడానికి పోటీలు పడుతున్నారు.   

 
  •  
  •  
  •  
  •  
  •  
  •