సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ కనుక అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి అమ్మకపోతే టిక్ టాక్ ఇక నుంచి అమెరికాలో నిషేధించబడుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే తేల్చి చెప్పాడు. దీనిపై చైనా ప్రభుత్వంతో పాటు టిక్ టాక్ కు చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అమెరికా కోర్టులో ప్రభుత్వ విధానాన్ని తప్పు పడుతూ కేసు వేయడం కూడా జరిగింది. ఒకవైపున ఇలా ఉంటే మరొక వైపున టిక్ టాక్ అమ్మకంపై కూడా దృష్టి పెట్టింది. ఒకవేళ కేసు తమకు అనుకూలంగా లేకపోతే టిక్ టాక్ ను అమ్మేయవల్సిన పరిస్థితి తప్పదు.

ఇప్పటికే టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ తో పాటు, ట్విట్టర్ కూడా పోటీ పడుతున్నాయి. మరొకవైపున రేస్ లోకి గూగుల్ కూడా వచ్చేసిందని అనేక వార్తలు పుడుతున్న వేళ గూగుల్ సీఈఓ సుదర్ పిచాయ్ క్లారిటీ ఇస్తూ టిక్ టాక్ కొనాలన్న ఆసక్తి తమకు లేదని తేల్చి చెప్పారు. దీనితో గూగుల్ రేస్ నుంచి తప్పుకోవడంతో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ రెండింటిలో ఎవరు టిక్ టాక్ ను సొంతం చేసుకుంటారో అనే ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే భారత్ లో టిక్ టాక్ నిషేధించడంతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ టిక్ టాక్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.