ఒక వ్యక్తిలోని గుణ గణాలు చూడాలంటే ఆ వ్యక్తి యొక్క గతంతో పాటు ప్రస్తుత పరిస్థితులను రెండింటిని ఒకసారి సరిపోల్చుకొని చివరకు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది నిర్ణయించడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక గ్రామం ప్రజలు వైఎస్ ను తమ గ్రామానికి రావద్దని అడ్డగించి నినాదాలు చేస్తారు. ఆ ఊరిలోని పెద్ద మనిషి మా ఊరి ప్రజలు మిమల్ని తిరస్కరించారని మీరు మా ఊరిలోకి రావడానికి అనుమతి లేదని చెప్పడంతో రాజశేఖర్ రెడ్డి వారి ఆజ్ఞను శిరసావహించి గ్రామంలోకి అడుగుపెట్టకుండా వెనుతిరిగిపోతుంటే… ఆ గ్రామ పెద్ద ఆ ఊరు ప్రజలతో రాజశేఖర్ రెడ్డి గతం గురించి చెబుతూ… నేను చూస్తున్న రాజశేఖర్ రెడ్డి ఇతను కాదు, రాజశేఖర్ రెడ్డి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కానీ ఆ ఆవేశం… ఆ ఆక్రోశం ఇప్పుడు కనపడటంలేదని చెబుతూ రాజశేఖర్ రెడ్డి పట్ల విధేయత ప్రకటించి వచ్చే ఎన్నికలలో నా ఓటు నీకే… నీ పార్టీకి కాదు అని ఆ ఊరి పెద్ద చెప్పే సన్నివేశంతో రాజశేఖర్ రెడ్డి తన గతాన్ని తుడిచివేసుకొని ప్రజల కోసం ఎంతలా పరితపిస్తున్నాడో అనేదానిని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.

“యాత్ర” సినిమా ముందుగా కమర్సియల్ సినిమా కాదు, అలాగని డ్యూయెట్స్ ఉండవు. ఒక వ్యక్తి జీతంలో కీలక ఘట్టాన్ని తీసుకొని తాను ముఖ్యమంత్రిగా ఎదిగి తన స్థాయిని పెంచుకోవడంతో పాటు, ప్రజలకు ఎలాంటి మేలు చేశాడన్న ఒక్క పాయింట్ ఆధారంగా మాత్రమే దర్శకుడు సినిమాను తీర్చిదిద్దాడు. 2003 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రణాళిక, తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోశాడన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ పాదయాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసిన కష్టాలు, ప్రజల కోసం తాను ఎలాంటి పధకాలు రూపకల్పన చేయాలన్న విషయాన్ని పాదయాత్ర సమయంలోనే వైఎస్ నిర్ణయించారని సినిమాలో ప్రధాన ఘట్టంగా తీసుకొని చెప్పారు.

కానీ సినిమాలో కొన్ని అసంపూరితమైన సన్నివేశాలు, కొంత సినిమాటిక్ గా చూపించాడని దర్శకుడు ప్రయత్నించాడు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ హైకమాండ్ కు విధేయుడిగా ఉండేవాడు. కానీ సినిమా మొత్తం రాజశేఖర్ రెడ్డి నేను చెప్పిందే హైకమాండ్ వినాలని తాను ఒక నిర్ణయాత్మకమైన శక్తీ అన్నట్లు చూపించడంతో పాటు… తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీనే విలన్ గా చూపించడానికి దర్శకుడు ఎంతో తాపత్రయపడ్డాడు.

ఇక రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన వారు ఇద్దరు. వారిలో ఒకరు కేవీపీ రామచంద్ర రావు కాగా మరొకరు సూరీడు. కానీ కేవీపీ పాత్రను ఉన్నది ఉన్నట్లు చూపించి సూరీడు పాత్రకు మాత్రం కొంత కోతకు గురిచేశాడు. సూరీడు పాత్ర సినిమా మొత్తం మీద నాలుగైదు సీన్స్ కన్నా ఎక్కువ కనపడదు. అలా దర్శకుడు సినిమాను తీయడానికి వైఎస్ జగన్ పై ఉన్న ప్రేమో లేక, సూరీడుతో ప్రస్తుతం వైఎస్ కుటుంబానికి సత్సంబంధాలు లేకపోవడమో కారణం కావచ్చు.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రను చూపించకుండా ఫోన్ సంభాషణకు మాత్రమే పరిమితం చేసి దర్శకుడు తన ప్రతిభను చూపించాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణలో “బ్రిఫ్డ్” పదం వాడుకొని కొంత ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం దర్శకుడు చేసాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి… కేవీపీ మాటకు ఎంత విలువ ఇస్తాడన్నదాని మీద దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనపడుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన అనుచరుల కోసం ఎంత వరకైనా వెళ్తాడన్న విషయాన్ని చెప్పడానికి దర్శకుడు కొన్ని పాత్రలను సృష్టించాడు.

తొలి అర్ధ భాగంలో అభిమానులను ఎమోషనల్ గా కదిలించే సీన్స్ రెండు, మూడు ఉంటాయి. కానీ సినిమా కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా సినిమాలో మమ్మూటీ చెప్పే సంభాషణలు చాల సహజంగా ఉండటంతో సినిమా నెమ్మదిగా సాగుతుందన్న విషయం ఎక్కడా అనిపించదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే అభిమానులకు ఈ సినిమాలో వచ్చే ఏదో ఒక చిన్న సంఘటన అయినా మనస్సుని కదిలిస్తుంది. వైఎస్ ను అభిమానించే వారికి ఇది గొప్ప సినిమాగా అనిపించినా తటస్థుడికి మాత్రం ఇది వైఎస్ మార్క్ సినిమాలాగే కొనసాగుతూ కొంత మేర వైసిపి పార్టీకి లబ్ది చేకూర్చేలాగే ఉంటుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

రెండవ అర్ధభాగంలో రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రలో సొమ్మసిల్లి రెస్ట్ తీసుకునే సమయంలో వైఎస్ విజయమ్మ… రాజశేఖర్ రెడ్డితో జగన్ బాబు ఫోన్ చేసాడనే చెప్పడంతోనే జగన్ పాత్రను ముగించారు. కానీ చివర్లో సినిమా ఎండ్ కార్డు వేసే సమయంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలోని ఫుటేజ్ వాడుకొని, జగన్ నల్లకాలువ దగ్గర మాట్లాడిన మాటలను పొందు పరిచి వైఎస్ అభిమానులు కొంత ఉద్వేగానికి లోనయ్యేలా చేసాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్మూటీని తప్ప మరొకరిని ఊహించుకోలేము. మమ్మూటీ చెప్పిన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ లోగాని వైఎస్ ను అనుకరించడానికి తన వంతు ప్రయత్నం చేసి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. యాంకర్ అనసూయ చేసినది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి నమ్ముకున్న వారి కోసం తాను ఎందాకైనా వెళ్తాడన్న దానికి గౌరు సుచరిత రెడ్డి కుటుంబం పట్ల చూపించిన విధేయత అనసూయ పాత్రలో స్పష్టంగా కనపడుతుంది. ఇక సబితా ఇంద్ర రెడ్డి పాత్రలో సుహాసిని, కేవీపీ పాత్రలో రావు రమేష్, వైఎస్ విజయమ్మగా ఆశ్రీత, వెంకటరావు పాత్రలో పోసాని, తెలుగుదేశం పార్టీ నేతగా 30 ఇయర్స్ పృథ్వి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

దర్శకుడు మహి వి రాఘవ మొదటి నుంచి చెబుతున్నట్లు ఇది రాజశేఖర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని సినిమాను నిర్మిస్తున్నానని, వైఎస్ ను గొప్పవాడిగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడుని ఎక్కడా తక్కువ చేసి చూపించకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని కూడా కొంత మేర ఆకట్టుకున్నాడు. సిరివెన్నెల అందించిన సాహిత్యానికి సంగీత దర్శకుడు “కే” పూర్తి న్యాయం చేయలేకపోయినా పాటలు పర్లేదనిపించేలా ఉన్నాయి.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాను ప్రజల మధ్యకు ఎక్కువగా తీసుకొని వెళ్లి, రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పధకాలను కొనసాగించడంతో పాటు జగన్ మోహన్ రెడ్డి ఒకడు ముందుకు వేసి ప్రజల పట్ల అదే విధంగా విశ్వసనీయత చూపిస్తాడని ప్రచారం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.

చివరగా : రాజన్న గుర్తులు చిరస్మరణీయం

రేటింగ్ : 3/5

రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి