జగన్ ఈ పేరు చెబితే ఎందుకో ఒక వర్గం మీడియాకు ముచ్చెమటలు పడుతాయి. సరే జగన్ కన్నా ముందు మాస్ లీడర్ గా ఎదుగుతున్న రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండే పత్రికలలో స్పేస్ ఇచ్చి కవర్ చేశాయి. రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏమి చేస్తాడులే… కాంగ్రెస్ పార్టీ సంగతి తెలిసిందేగా అన్నట్లు వైఎస్ పట్ల కాస్త నెమ్మదిగా వ్యవహరించినా… 2004లో వైఎస్ సీఎంగా అధికారాన్ని చేపట్టిన తరువాత ఒక ఆరు నెలలో అన్ని సర్దుకొని వైఎస్ తన మార్క్ పాలన మొదలు పెట్టాడు. పేదలే దేవుళ్ళు… పేదల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందన్న రీతిలో వ్యవహరిస్తుంటే ఆ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడి… పేదల దేవుడిగా మారేలా ఉన్నాడే… అర్జెంటుగా తొక్కేసే కార్యక్రమం మొదలు పెట్టాలని లేనిపోని ఆరోపణలు వైఎస్ పైన చేసినా 2009 ఎన్నికలలో వైఎస్ఆర్ తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకొని తిరిగి అధికారాన్ని చేపట్టాడు. దురదృష్టవశాత్తు వైఎస్ చనిపోవడంతో ఆ మీడియా అధిపతులు ఎక్కడలేని ఆనందం బయటకు కనపడకపోయినా లోలోన వ్యక్తం చేసే ఉంటారు.

ఇక జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి, ప్రజల కోసం తన తండ్రి బాటలో నడవాలనుకున్నాడో… కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లా మరో మాస్ లీడర్ ను ఏపీలో ఎదగనియ్యకూడదన్న భావనతో చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రయత్నాలలో
భాగంగా పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో పాటు జగన్ పైన లేనిపోని ఆరోపణలతో ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీతోనే జత కట్టి… జగన్ అన్ని లక్షల కోట్లు సంపాదించాడు… ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడని చెయ్యని ప్రచారం లేదు. ఇక ఏకంగా సీబీఐలోనే తన మనుషులను పెట్టుకునే స్థాయికి ఈ మీడియా వ్యవహారం వెళ్లిందంటే ఎంతలా వ్యవస్థలను నాశనం చేశాయో చెప్పుకోవచ్చు. జగన్ ను సిబిఐ విచారణలో భాగంగా… జగన్ ను ఇలా ప్రశ్నలు అడిగారని.. అలా అడిగారని లేనిపోని కథనాలతో ఎన్ని కుట్రలు చేసినా జగన్ 2014లో అధికారానికి కాస్త దగ్గరాగా వచ్చి దూరమైనా… చివరకు 2019లో అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక జగన్ సీఎంగా అధికారాన్ని చేపట్టినా ఆ మీడియాకు మాత్రం ఎటువంటి సిగ్గు లేకుండా ఉన్నది లేనట్లు జగన్ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది అన్నట్లు వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తునే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన తప్పులు… ప్రజలపైన భారం వేసిన వేల కోట్ల రూపాయల డబ్బు ఎలా దోచుకున్నారో ఒక్క గంట సేపు చర్చ పెట్టమంటే పెట్టే దైర్యం ఈ మీడియాకు లేదు. కానీ జగన్ వచ్చి రెండు నెలలు కూడా సరిగ్గా కావడం లేదు… పారదర్శకంగా పాలన నడవాలని అధికారులకు ప్రతిరోజు చెబుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నా… ఎక్కడో జరిగే చిన్న తప్పును బూతద్దంలో చూపించి, రాష్ట్రంలో అల్లకల్లోలం అయిపోతుందని, రాష్ట్రం అట్టుడికిపోతుందని ఇలా అనేకమైన నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ప్రజలలో బద్నామ్ చేయాలని ప్రయత్నం చేయని రోజు లేదు. ఒక వేళ జగన్ కు కనుక ఒక 100 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంటే వీరు రాసే తప్పుడు వార్తలతో ప్రభుత్వాన్ని పడేసినా పడేసేవారనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అలాంటి వార్తలతోనే అప్పట్లో పార్టీ పెట్టుకున్న తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ సీఎం ఎన్టీఆర్ ను రోడ్డు కీడ్చడంలో ఈ మీడియా అధిపతులుగా చెప్పుకునే వారే ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం మీద పడిపోతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •