నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి అధికారం చేపట్టిన తరువాత వినూత్నమైన ప్రజాసంక్షేమ పథకాలతో పాటు, అవినీతి రహిత పాలన అంటూ ఎమ్మెల్యేలతో పాటు అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేసేవాడు. ఎన్టీఆర్ చేపట్టిన ప్రజాకర్షక పధకాల పట్ల ప్రజలలో ఎంతో గొప్ప పేరు వచ్చింది. కానీ, ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ అవినీతి చేయడానికి సహించకపోవడంతో ఎన్ని ప్రజాకర్షక పనులు చేసినా  1989 ఎన్నికలలో ఓటమి పాలయ్యాడు. 

అసలు అప్పుడు ఎన్టీఆర్ ఓడిపోతాడని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండదు. కేవలం సొంత పార్టీ నేతలు, అధికారుల తీరుతో ఓటమి చెందాడు. డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిచినా మాకు మరలా డబ్బులు తినే యోగం ఎన్టీఆర్ వల్ల కలగడం లేదని ఒకింత ఆగ్రహంతో సొంత పార్టీ నేతలే లోపాయికారంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా పని చేశారు. 

ఇప్పుడు ఇదే ఫార్ములా జగన్ విషయంలో కూడా ఏమైనా జరుగుతుందా అని కొంత మంది కార్యకర్తలు మధన పడుతున్నారు. జగన్ అధికారాన్ని చేపట్టిన దగ్గర నుంచి అవినీతి రహిత పాలన మీద దృష్టి పెట్టడంతో పాటు, ప్రజలకు వినూత్నమైన పధకాలు అందించేందుకు తాను చెప్పిన నవరత్నాలతో పాటు మరి కొన్ని ఆలోచనలను కూడా ప్రజల కోసం చేస్తుండటంతో పాటు శాసనసభ్యులకు అవినీతి చేస్తే సహించేది లేదని ఒకవైపున క్లాస్ లు తీసుకుంటూ అందుకు తగట్లు పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయడం ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒకటి, రెండు సంవత్సరాల తరువాత ఎమ్మెల్యేలతో పాటు, అధికారులలో కూడా కొంత ఆక్రోశం వెళ్లగక్కే అవకాశం ఉంది. 

ఈరోజులలో ఏపని చేయాలన్న డబ్బు లేనిదే అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. అలాంటిది అవినీతి చేయకుండా వచ్చే ఎన్నికలలో గెలిచేదెలా అనే ప్రశ్న కూడా ఎమ్మెల్యేల మదిలోకి రావచ్చు. ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి జగన్ నే నమ్ముకున్న చాల మంది నేతలు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితులలో ఉన్నారు. ఈ పరిణామాలను 2024 ఎన్నికలలో జగన్ ఎలా ఎదుర్కొని  విజయం సాధిస్తాడో చూడాలి. 
  •  
  •  
  •  
  •  
  •  
  •