కొంత మందికి పొద్దు పొద్దునే నోట్లో కాస్త చుక్క పడితే గాని ఎనర్జీ రాదు. చుక్కేసి పనికెళ్ళేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు తొమ్మిదింటికల్లా మందు షాపుల ముందు క్యూ కట్టి మందు కోసం రెడీగా ఉంటారు. ఇక జగన్ ప్రభుత్వం నిన్నటి నుంచి మొదలు పెట్టిన కొత్త మద్యం పాలసీతో తొమ్మిదింటికల్లా టంచన్ గా మందు షాపు దగ్గర కెళ్లిన వారికి షాక్ తగిలిందని చెప్పాలి. 11 గంటల వరకు మందు షాపులు తెరవరని చెప్పడంతో సీఎం జగన్ పై కారాలు మిరియాలు నూరారట.

ఇక సాయంత్రం కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది, పల్లెటూర్లలో చాల మంది అవగాహన లేకపోవడంతో రాత్రి 8 గంటలకే మద్యం షాపులు మూసివేయడం కూడా వారికి నచ్చడం లేదట. అన్ని పనులు ముగించుకొని వచ్చేసరికి 8 అవుతుందని, ఆ సమయానికి మందు షాపులు మూసివేయడంతో తామెట్ల మందు తాగాలని అంటున్నారట. కొంతమంది ముందుగానే తెలుసుకొని మందు షాపుల దగ్గరకు తాగడానికి వచ్చిన వారికి అక్కడ పర్మిట్ రూమ్ లు లేకపోవడంతో పాటు మరోవైపున బీర్లు కూలింగ్ లేకపోవడం జగన్ ను తిట్టుకునే పనిలో మందు బాబులు నిమగ్నమయ్యారట.

ఇప్పుడే మందు బాబుల పరిస్థితి ఇలా ఉంటే, ఇంకా నాలుగు సంవత్సరాలలో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి మరోసారి ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని చెప్పిన జగన్ దెబ్బకు వీరంతా ఏమైపోవాలో… జగన్ ప్రభుత్వం రాత్రి 8 గంటల వరకు కాకుండా 6 గంటలకే మూసివేస్తే తిన్నగా ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని పాడుకుంటారని మహిళలు అంటున్నారట. ఇక దీనితో పాటు మద్యం ధరలు కూడా భారీగా పెంచడంతో మందుబాబులు కాస్త అసహనంతో పాటు బాధలు కూడా తన మందు బాబుల స్నేహితులతో పంచుకుంటూ మొదటి రోజు కికెక్కించుకున్నారు.

సీఎం జగన్ చెప్పిన విధంగా మందు షాపులను కనుక ఐదేళ్లలో లేకుండా చేస్తే మహిళ ఓట్లు గంపగుత్తగా జగన్ కు పడతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక నుంచి రాబోయే రోజులలో మందుబాబులకు అన్ని కష్టాలే. సీఎం జగన్ దెబ్బకు ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా మందు మానేయడం అలవాటు చేసుకోవాలి.