చంద్రబాబు నాయుడు నివాసం పక్కన గత ప్రభుత్వం నిర్మించిన ఉండవల్లిలోని ప్రజా వేదిక విషయంలో గత నాలుగు రోజులుగా మీడియా సాక్షిగా తెలుగుదేశం నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంత అకాదు. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే ఏకంగా ధర్నాకు దిగి, అక్కడ ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. దీని అంతటికి కారణం, ఏపీ ప్రభుత్వం ప్రజావేదిక భవనంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు, చంద్రబాబు నాయుడుకి ఉన్న సామానులను ఖాళీ చేయించి అక్కడ ఈరోజు కలెక్టర్లు సమావేశం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసారు.

ఈ వేదికగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో తెలియచేయడానికి ఇక్కడ సమావేశం నిర్వహించామని, ఇదే ఇక్కడ జరిగే చివరి సమావేశమని, ఈ సమావేశం తరువాత ఈ ప్రజావేదికను కూల్చి వేస్తామని, ఏపీలో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదికతోనే మొదలవుతుందని వైఎస్ జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే బుధవారం నుంచి ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలియచేసారు.

ఈ ప్రజావేదిక పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఇప్పటికే సీఆర్డీఏ నేతలు ప్రజావేదిక అక్రమ నిర్మాణంపై నివేదిక సమర్పించారు. ఇది పేరుకు మాత్రమే ప్రభుత్వ భవనం అని, దీనిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంగా టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ భవనాలు ఉపయోగించకూడదన్న నిబంధన ఉన్నా, చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా ఈ ప్రజావేదిక భవనంలోనే సభలు, సమావేశాలు పెట్టి ఎన్నికల కోడ్ ను తుంగలో తొక్కాడు. ఇప్పుడు అదే ప్రజావేదికను పట్టుకొని వేలాడుతూ, జగన్ ప్రభుత్వం ఏదో చేయకూడని పని చేసి తెలుగుదేశం పార్టీని అణచివేతకు గురి చేస్తుందని నాలుగు రోజులుగా మాట్లాడటంతో, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక రకంగా తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు నాయుడుకి కూడా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
  •  
  •  
  •  
  •  
  •  
  •