Saturday, April 27, 2024

మీకు టిక్కెట్లు లేవుమొహ‌మాటం లేకుండా చెప్పేయ‌నున్న జ‌గ‌న్‌

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీల‌కంగా మారాయి. ఈ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా గ‌త ఎన్నిక‌ల‌కు మించిన విజ‌యాన్ని అందుకోవాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. త‌న పాల‌న‌నే పార్టీని మ‌ళ్లీ గెలిపిస్తుంద‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌నకు ప్ర‌జాభిప్రాయంపైన ప‌లు నివేదిక‌లు వ‌స్తున్నాయి. ఈ నివేదిక‌ల్లో ఒక విష‌యం స్ప‌ష్టంగా వెల్ల‌డ‌వుతున్న‌ది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న బాగుంది, ప‌థ‌కాల‌న్నీ అందుతున్నాయ‌ని చెప్తున్నారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌కు పూర్తి మార్కులు వేస్తున్నారు. అయితే, కొంద‌రు ఎమ్మెల్యేల విష‌యంలో మాత్రం కొంత‌మంది ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్నట్లు క‌నిపిస్తున్న‌ది.

ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండ‌టం లేద‌ని కొంద‌రు ప్ర‌జ‌లు చెప్తున్నారు. మ‌రికొంద‌రు పార్టీ కార్య‌క‌ర్త‌లే త‌మ ఎమ్మెల్యేలు గెలిచాక త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అసంతృప్తితో ఉన్నారు. గ్రూపుల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని, త‌న చుట్టూ ఉండే కొంద‌రికే ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల‌పై ఉన్నాయి. మ‌రో ప‌క్క జ‌గ‌న్ ప‌దేప‌దే స‌మీక్ష‌లు జ‌రిపి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యేల‌ను కోరుతున్నారు. క‌చ్చితంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఇంటింటినీ చేరాల‌ని ఆయ‌న ప‌దే ప‌దే నొక్కి చెప్తున్నారు.

ఇంత‌గా చెప్తున్నా కూడా కొంద‌రు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌లేక‌పోతున్నారు. కొంద‌రు సీనియ‌ర్లు పాత త‌ర‌హా రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డిపోయి ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రిగ్గా చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు అనారోగ్య కార‌ణాలు, వ‌య‌స్సురీత్యా పూర్తిస్థాయిలో కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌లేక‌పోతున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్లి వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆ కుటుంబాల‌కు ప‌థ‌కాల రూపంలో ఎంత ల‌బ్ధి క‌లిగిందో చెప్పాల‌నేది జ‌గన్ ఆలోచ‌న‌.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఎమ్మెల్యేలు శ్ర‌ద్ధ‌గా చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి, పార్టీకి తిరుగుండ‌దు. కానీ, కొంద‌రు ఈ కార్య‌క్ర‌మాన్ని సీనియ‌ర్‌గా తీసుకోవడం లేదు. జ‌గ‌న్ స‌మీక్ష చేసిన వారం పాటు కొంత‌మేర తిరుగుతున్నా త‌ర్వాత మ‌ళ్లీ తూతూమంత్రంగా మార్చేస్తున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప‌ట్ల జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు ఆయ‌న మాట‌లే చెప్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఏయే ఎమ్మెల్యే ఎంత స‌మ‌యం ఈ కార్య‌క్రమానికి వెచ్చించార‌నే రిపోర్టుల‌ను ప‌క్కాగా తెప్పించుకుంటున్నారు. అందుకే, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మ‌రీ స‌మీక్ష‌ల్లో ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు.

ఇంత చెప్పినా మార‌ని ఎమ్మెల్యేలు, ఆరోప‌ణ‌లు ఉన్న వారు, ప్ర‌జ‌ల్లో తిరగ‌డం లేద‌నే పేరు ఉన్న వారు, ప్ర‌జావ్య‌తిరేక‌త ఉన్న ఎమ్మెల్యేల విష‌యంలో మొహ‌మాటానికి వెళ్లేందుకు ఈసారి జ‌గ‌న్ ఏమాత్రం సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేలు అంద‌రికీ ఈసారి టిక్కెట్లు ఇచ్చే అవ‌కాశాలు లేవ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే, ఆయ‌న సిట్టింగులు అంద‌రికీ మ‌ళ్లీ టిక్కెట్లు ఇస్తాం అని ఎక్క‌డా చెప్ప‌డం లేదు. ప‌నితీరు చూస్తాన‌ని, ప‌నితీరును బ‌ట్టే మ‌ళ్లీ పోటీ చేసే అవ‌కాశం ఇస్తాన‌ని అనేక హింట్లు ఇస్తున్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితి బ‌ట్టి చూస్తే కనీసం 30 నుంచి 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ద‌క్కే అవ‌కాశం లేన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. ఇందులో కొంద‌రికి ప్ర‌స్తుత సిట్టింగ్ సీటు ఇవ్వ‌కుండా మ‌రో చోట‌కు మార్చే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌య‌స్సురీత్యా, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారి వార‌సుల‌కు కొంద‌రు టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల బ‌లం కంటే జ‌గ‌న్ అనే పేరు, ఫ్యాన్స్ గుర్తే వైసీపీకి అభ్య‌ర్థుల‌కు గెలుపు క‌ట్ట‌బెట్టింది. ఈసారి మాత్రం ఎమ్మెల్యేల ప‌నితీరు కూడా ప్ర‌ధానం కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప‌నితీరు బాగాలేని ఎమ్మెల్యేల‌కు మొహ‌మాటం లేకుండా టిక్కెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గన్ చెప్ప‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!