వచ్చే ఎన్నికల ఫలితాల్లో అందరు ఎదురు చూసే నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడ మెజార్టీసార్లు టీడీపీనే విజయం సాధించింది. గతంలో దాసరి బాలవర్ధన్ రావు అక్కడ నుంచి టీడీపీ తరుఫున విజయం సాధించగా.. ఎన్టీఆర్ ఇచ్చిన సిఫారసుతో సీటు తెచ్చుకుని 2014,2019 ఎన్నికలలో వల్లభనేని వంశీ వరుసగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం.. తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో .. వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ తరుఫున బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
పార్టీ అధిష్టానం కూడా దీనికి గ్రీన్ సీగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికి కూడా .. ఇప్పుడే అసలు సమస్య మొదలైంది. వల్లభనేని వంశీ అభ్యర్దిత్వాన్ని అంగీకరించడం లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ మీద పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. వల్లభనేని వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలిసి పని చేసుకోవాలని జగన్ సూచించినప్పటికి కూడా వీరి మధ్య సఖ్యత మాత్ర కుదరడం లేదు. గత ఎన్నికల్లో వంశీకి వ్యతిరేకంగా పని చేసి..ఇప్పుడు అనుకూలంగా పని చేయటం సాధ్యం కాదని వెంకట్రావు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఆయన సంచలన నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.
జగన్ నిర్ణయంలో మార్పు లేకుంటే..వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగాలని యార్లగడ్డ వెంకట్రావు నిర్ణయించుకున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. త్వరలోనే వెంకట్రావు కొత్తగా రాజకీయ కార్యాలయం ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా యార్లగడ్డ వెంకట్రావుకు ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే వంశీకి వ్యతిరేకంగా ఉన్న ముఖ్య నేతలకు ప్రాధాన్యత ఇస్తామనే విధంగా ఆఫర్లు ఇస్తున్నారట టీడీపీ నేతలు. వంశీకి వ్యతిరేకంగా ఉన్న వారిని తమకు అనుకూలంగా మలచుకొనే పని టీడీపీ నేతలు ప్రారంభించారని తెలుస్తోంది. వెంకట్రావు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే టీడీపీకి అనుకూలంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. వీరందరిని తట్టుకుని వల్లభనేని వంశీ ఎలా నిలబడతారో… గన్నవరంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.