వైసీపీ అధిష్టానం ఈసారి ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచింది. గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ చరిత్ర తిరగరాసే సీట్లు సాధించినప్పటికీ ప్రకాశంలో మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12కి కేవలం 8 సీట్లతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలను వైసీపీ గెల్చుకుంటే.. ఒక్క ప్రకాశంలో మాత్రం కొండపి ఎస్సీ స్థానంలో ఓటమి పాలైంది. ఈసారి ఎలాగైనా జిల్లాలో పార్టీని స్వీప్ చేయించాలని వైసీపీ అధిష్టానం కంకణం కట్టుకుంది.
టీడీపీ ఫ్లాప్ ఫార్ములాతో వైసీపీ..
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తోంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జిల్లాలో ఉన్న వైశ్యుల ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని వ్యూహం రచిస్తోంది. గత 2019 ఎన్నికల్లో శిద్ధా రాఘవరావును చంద్రబాబు ఒంగోలు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఆయన మాగుంట చేతిలో ఓటమిపాలయ్యారు. 2 లక్షలపైచిలుకు మెజారిటీతో మాగుంట గెలుపొందారు. కానీ ఆ పార్లమెంట్ పరిధిలో మాత్రం వైశ్యులు శిద్ధాకు మద్దతుగా నిలిచినట్టు రిపోర్టు అందుకుంది. మరోవైపు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాములో జైలులో ఉన్న కారణంగా ఆ కుటుంబంపై ఒత్తిడి పెంచడం భావ్యం కాదని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తండ్రీకొడుకుల్లో ఎవరో ఒకర్ని పశ్చిమ ప్రకాశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్టు తెలుస్తోంది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతోపాటు వైశ్య..
గడిచిన నాలుగేళ్లుగా సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో మరింత ఆదరణ సంపాదించుకున్న వైసీపీ.. వైశ్య సామాజికవర్గం కూడా తోడైతే అభ్యర్థుల గెలుపు మరింత సునాయాసం అవుతుందని అంచనాకు వచ్చింది. వైసీపీ ఫార్ములా వర్కవుట్ అయితే గనుక ఈసారి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. శిద్దా రాఘవరావు ఎంపీ అభ్యర్థి అభ్యర్థి అయితే ఎమ్మెల్యే సీట్లలో కూడా భారీ మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొదటిసారి గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమ సీటు త్యాగం చేయకతప్పని పరిస్థితి ఎదురుకావొచ్చని తెలుస్తోంది.