వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో 10 – 20 సీట్లు గెలుచుకొని ఎలాగైనా జనసేన పార్టీని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వ్యూహాన్నే పన్నారు. అందుకే, తన టార్గెట్ కేవలం గోదావరి జిల్లాలే అని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సినిమాలు, సినిమా హీరోలపై అభిమానం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మిగతా హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా అభిమానులు ఎక్కువగానే ఉంటారు. అందుకే, తన ఫ్యాన్స్‌తో పాటు ఈ హీరోల అభిమానుల మద్దతు కూడా పొందాలని పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశారు.
అందుకే, మెళ్లిగా ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ అభిమానులను దువ్వడం ప్రారంభించారు. వారు తనకంటే పెద్ద హీరోలు అంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. అందరు హీరోల అభిమానులు తనకు మద్దతు ఇవ్వాలని పదేపదే కోరుతున్నారు. అందరు హీరోలు కలిసి ఉన్నట్టుగా ఎడిటింగ్ చేసిన ఫోటోలను ప్రదర్శిస్తూ తాను అందరినీ ఇష్టపడతానని చెప్పుకునే ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. తమ హీరో స్కెచ్‌ను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానుల, న్యూట్రల్ ముసుగు వేసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీలు కూడా సోషల్ మీడియాలో ఇతర హీరోల అభిమానులను దువ్వడం ప్రారంభించారు.
ఈసారి ఎన్నికల్లో హీరోలు అందరి అభిమానులు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇవ్వాలని ప్రచారం ప్రారంభించారు. అయితే, ఇది పూర్తిగా రివర్స్ కొట్టింది. ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన అభిమానులు ఒక్కసారిగా ఎన్నికల ముందు ఇంతలా మారడం వెనుక మర్మాన్ని ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పసిగట్టేశారు. కేవలం తమ మద్దతుతో ఎన్నికల్లో లాభం పొందేందుకే పవన్ కళ్యాణ్ తమ హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారే కానీ నిజంగా ఆయనకు వారిపై ప్రేమ లేదనే విషయన్ని గుర్తించారు.
పైగా ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోలను అవమానించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు పోస్టులు పెట్టడం, ట్రోల్స్ చేయడం ఇంకా ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ అభిమానులు మరిచిపోలేదు. అంతేకాదు, తమ హీరోల సినిమాలు బాగున్నా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటి రోజే నెగటీవ్ పబ్లిసిటీ చేయడం, సినిమాలు ఫ్లాప్ అని కుట్రపూరితంగా ప్రచారం చేసిన వైనాన్ని కూడా మిగతా హీరోల అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ఉదాహరణకు మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమా బాగున్నా కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు నెగటీవ్ పబ్లిసిటీ చేసిన వైనాన్ని మహేశ్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అనుభవం ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఎంతో ఉంది. మిగతా హీరోల సినిమా ఫంక్షన్లకు పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్లి పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం, రగడ సృష్టించిన ఉదాహరణలు కూడా బోలెడు ఉన్నాయి. ఇవన్ని గుర్తు చేసుకుంటున్నారు ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ అభిమానులు. పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ఎన్నికల ముందు మారినట్టు నటించినంత మాత్రాన తాము నమ్మేందుకు అమాయకులం కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.