భారత క్రికెట్‌కు ఆల్‌రౌండర్ల కొరత ఎప్పుడూ ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ నిలకడగా రాణించే ఆటగాళ్ళు చాలా తక్కువ మంది వస్తుంటారు. వచ్చినవారిలో కొందరు తక్కువ కాలానికి పరిమితమై జట్టుకు దూరమైన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఒక స్టేజ్‌లో కెరీర్ ముగిసిందనుకున్న హార్థిక్ పాండ్యా మాత్రం ఇప్పుడు టీమిండియాకు కీలక ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫామ్, ఫిట్‌నెస్ కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయిన పాండ్యా మళ్ళీ అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను లీడ్ చేసి ఛాంపియన్‌గా నిలపడమే కాదు వ్యక్తిగతంగానూ రాణించాడు. పోయిన చోటే వెతుక్కోవాలన్న రీతిలో తన మునుపటి కంటే మెరుగైన ఫామ్ అందుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా తన పునరాగమనంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జట్టులో చోటు కోల్పోయిన తర్వాత నిరాశకు గురైన మాట వాస్తవమేనని చెప్పాడు. ప్రతీ అంశాన్ని సానుకూలంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నానని, పాజిటివిటీ పెంచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. జీవితంలో మంచి, చెడు రోజులూ రెండు వస్తాయని తెలిసినా ఒక స్టేజ్‌లో వాటిని సరిగా తీసుకోలేకపోయానని వ్యాఖ్యానించాడు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబం తనకు అండగా నిలిచిందని, వారి సపోర్ట్ కారణంగానే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వగలిగానని చెప్పాడు. క్లిష్ట సమయంలో కుటుంబం ఇచ్చిన మద్ధతుగా సానుకూలంగా ఆలోచించి వాటిని అధిగమించానని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్‌పై గతంలో కంటే ఎక్కువగా ఫోకస్ పెట్టానన్న పాండ్యా బౌలింగ్ చేయడంలో తొందరపడలేదని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం జట్టు అవసరాలకు అనుగుణంగా బౌలింగ్ చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు.
గతేడాది వెన్నునొప్పితో జట్టుకు దూరమైన హర్థిక్ పాండ్యా కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది భావించారు. జట్టులో పోటీ ఎక్కువవడంతో అతను తిరిగి రావడం కష్టమేనని అనుకున్నారు. అయితే ఫిట్‌నెస్ సాధించిన తర్వాత ఐపీఎల్ ద్వారా తన సత్తా నిరూపించుకున్నాడు. రీ ఎంట్రీలో 36.33 సగటు, 151.38 స్ట్రైక్ రేటుతో 436 పరుగులు చేశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ మెరుగ్గా రాణించాడు. దీంతో అందరూ పాండ్యాలో సరికొత్త ఆల్‌రౌండర్‌ను చూశారు. ఈ ప్రదర్శనలతోనే మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చిన పాండ్యా ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో కీలకంగా ఉన్నాడు.